Naresh Goyal | ఆర్థిక ఇబ్బందులతో నేలకు పరిమితమైన దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. హవాలా లావాదేవీలు నిర్వహించారన్న ఆరోపణలపై నరేశ్ గోయల్‌తోపాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది.
నరేశ్ గోయల్ హవాలా లావాదేవీలు నిర్వహించారన్న అభియోగంపై సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. అంతే కాదు ఢిల్లీ, ముంబైల్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. నరేశ్ గోయల్ నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆర్థిక ఇబ్బందులతో 2019లో నరేశ్ గోయల్ సారధ్యంలోని జెట్ ఎయిర్వేస్ సర్వీసులు నిలిచిపోయాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలోని పలు బ్యాంకుల కన్సార్టియం వద్ద తీసుకున్న రుణాల చెల్లింపులో విఫలం అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జెట్ ఎయిర్వేస్ను ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం స్వాధీనం చేసుకుని దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టింది.
మూడేండ్ల క్రితం 2020 మేలో నరేశ్ గోయల్, ఆయన భార్య, అనితా గోయల్‌పై ఈడీ కేసులు నమోదు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి నిధులు మాయం చేశారని అభియోగం. ఆయన తన ఖాతాల్లోని నిధులను విదేశాల్లోని కొందరికీ భారీ మొత్తంలో ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.