న్యూయార్క్ : టెక్ దిగ్గజాల్లో మాస్ లేఆఫ్స్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. పది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గత నెలలో మైక్రోసాఫ్ట్ ప్రకటించగా విధుల నుంచి తొలగిస్తున్నామని పలువురు ఉద్యోగులకు కంపెనీ ఈ మెయిల్స్ పంపింది. కొలువుల కోతకు తెగబడిన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం హోలోలెన్స్, సర్ఫేస్, ఎక్స్‌బాక్స్ వంటి హార్డ్‌వేర్ డివిజన్లను టార్గెట్ చేస్తోందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
సీటెల్‌కు చెందిన 617 మంది ఉద్యోగులను కంపెనీ ఇప్పటికే సాగనంపింది. ఈ డివిజన్లకు చెందిన పలువురు ఉద్యోగులకు టెర్మినేషన్ లెటర్లు అందాయని లింక్డిన్ పోస్ట్‌ల్లో వెల్లడైంది. హోలోలెన్స్లో లేఆఫ్స్‌ను కంపెనీ ప్రతినిధి నిర్దారించారు. హోలోలెన్స్లో పలువురు సహోద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారని కంపెనీ మాజీ ఉద్యోగి క్రిస్టియన్ దవిల లింక్డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తనతో పాటు తన సహచరుల ఉద్యోగాలు కూడా ఈ రోజున రోల్స్ నుంచి తొలగించబడ్డాయని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ తాజా లేఆఫ్స్‌లో తాను కూడా ఉద్యోగం కోల్పోయానని మరో ఉద్యోగి, ఇంటరాక్షన్ డిజైన్, సైన్స్ లీడ్ సోఫీ స్టెల్మాక్ వివరించారు. ఇక డివిజన్లో మార్పుల గురించి తెలుసుకోవాలంటూ ఎక్స్‌బాక్స్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు.