వాషింగ్టన్, మార్చి 29: ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ ప్రపంచ సంచలనంగా మారింది. తక్కువ సమయంలోనే ‘గ్రోక్’తో ఎలాన్ మస్క్ సంపాదన పెరగటంతో..తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ను గ్రోక్తో అనుసంధానం చేసేందుకు చర్యలకు శ్రీకారంచుట్టారు.
ఇందుకోసం తాను స్థాపించిన స్టార్టప్ కంపెనీ ‘ఎక్స్ ఏఐ’కు ‘ఎక్స్’ (ట్విట్టర్)ను విక్రయించినట్టు మస్క్ తాజాగా ప్రకటించారు. ఎక్స్ వేదికగా శనివారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సొంత స్టార్టప్ కంపెనీ ‘ఎక్స్ ఏఐ’ అభివృద్ధి చేసిన చాట్‌బాట్ ‘గ్రోక్’..పెద్ద ఎత్తున నెటిజన్ల ఆదరణ చూరగొంటున్నది. రూ.2.80 లక్షల కోట్లకు ఎక్స్‌ను అమ్మినట్టు మస్క్ స్వయంగా తెలిపారు.
ఈ లావాదేవీలు పూర్తిగా స్టాక్ రూపంలో జరిగిందని, దీంతో ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లుగా ఉన్నదని మస్క్ పేర్కొన్నారు. అధునాతన ఏఐ టెక్నాలజీని ‘ఎక్స్’కు అనుసంధానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని మస్క్ తన పోస్టులో తెలిపారు. ప్రస్తుతం ‘ఎక్స్’కు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 60 కోట్ల మంది యూజర్లు ఉన్నట్టు సమాచారం.
2022 అక్టోబర్‌లో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఆ తర్వాత దీని పేరును ఎక్స్‌గా మార్చింది. డాటా, మాడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, ప్రతిభను అనుసంధానం చేయడానికి అడుగువేస్తున్నాం..ఇది ప్రపంచాన్ని ప్రతిబింభించడమే కాకుండా మానవ పురోగతిని మరింత వేగవంతంగా చేసే సమర్థవంతమైన నివేదికను నిర్మించడానికి వీలు కల్పిస్తున్నదని మస్క్ పేర్కొన్నారు.