బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితా
165 బిలియన్ డాలర్ల సంపదతో 7వ స్థానంలో బిల్‌గేట్స్
144 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్‌కు 10వ స్థానం
టాప్-10 ప్రపంచ సంపన్నులలో 8మంది టెక్నాలజీ ఇండస్ట్రీకి చెందినవారే
భారత్ నుంచి ముకేశ్ అంబానీకి 17వ స్థానం, గౌతమ్ అదానీకి 19వ స్థానం
టాప్-50లో నలుగురు భారతీయులకు చోటు
10.1 బిలియన్ డాలర్లతో తెలుగు వ్యాపారవేత్త మురళీ దివీ
Elon Musk | న్యూఢిల్లీ, డిసెంబర్ 12: అమెరికా బహుళజాతి ఆటోమోటివ్ దిగ్గజ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పేరిట నయా రికార్డు నమోదైంది. ఇప్పటికే ప్రపంచ కుబేరుడిగా విరాజిల్లుతున్న మస్క్.. ఓ అరుదైన ఘనతను సాధించారు. మస్క్ సంపద ఏకంగా 400 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది మరి. ఇప్పటిదాకా ఈ మైలురాయిని ఎవరూ అధిగమించలేదు. దీంతో ఈ రికార్డును సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా వివరాల ప్రకారం మస్క్ సంపద విలువ 447 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన దగ్గర్నుంచి మస్క్ సంపద క్రమేణా పెరుగుతూపోతూనే ఉన్నది. ఎన్నికల్లో ట్రంప్ కోసం మస్క్ పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ గెలుపు.. స్టాక్ మార్కెట్లలో మస్క్‌కు చెందిన కంపెనీల షేర్లకు విపరీతమైన ఊపును తెచ్చిపెట్టింది. ఇక టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లలో ర్యాలీ మస్క్ సంపదను అంతకంతకూ పెంచేస్తున్నాయి. పెరిగిన డిమాండ్ నడుమ ఈ షేర్లను ఇన్వెస్టర్లు ఎగబడిమరీ కొనేస్తున్నారు. మస్క్ తన ప్రైవేట్ అంతరిక్ష్య అన్వేషణ సంస్థ స్పేస్ఎక్స్ షేర్లతో 50 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకోగలిగారు. దీనంతటికీ ఇన్సైడర్ షేర్ సేల్ కారణమంటున్నారు. ప్రస్తుతం షేర్ ధర 135 డాలర్లదాకా ఉన్నది. ఇంకోవైపు టెస్లా షేర్ల విలువ ఆల్‌టైమ్ హైని తాకింది. ఒక్కో షేర్ 425 డాలర్లు పలుకుతున్నది.
గత నెల రోజుల్లో దాదాపు 136 బిలియన్ డాలర్లు మస్క్ సంపద పెరగగా.. కేవలం రెండు రోజుల్లోనే 58 బిలియన్ డాలర్లు పుంజుకోవడం గమనార్హం. మంగళవారం నాటికి ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్‌కు, మస్క్‌కు మధ్య సంపదలో తేడా 140 బిలియన్ డాలర్లే. కానీ గురువారం ఇది 198 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపద విలువ 249 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇక తాజా జాబితా ప్రకారం టాప్-5లో నలుగురు అమెరికన్లే. ఒక్కరే ఫ్రాన్స్ (బెర్నార్డ్ ఆర్నాల్ట్)కు చెందినవారున్నారు. కాగా, గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్-500 శ్రీమంతులతో ఈ జాబితాను బ్లూంబర్గ్ ఇచ్చింది. ఇందులో 26మంది భారతీయులున్నారు.