Twitter-Elon Musk | ట్విట్టర్లో పని చేస్తున్న ఉద్యోగుల భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సగం మందికి ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ ఉద్వాసన పలికారు. కష్టపడి పని చేస్తారా? వైదొలుగుతారా? తేల్చుకోవాలంటూ ఇటీవల ఆయన జారీ చేసిన ఆల్టిమేటంతో 1200 మందికి పైగా స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. వీరు కాకుండా ఇంకా కొందరు ఉద్యోగులను తొలగించడానికి ఎలన్ మస్క్ సిద్ధం అయ్యారని ట్విట్టర్ విశ్వసనీయ వర్గాల కథనం. సోమవారం నుంచే తాజాగా ఉద్యోగుల ఉద్వాసన మొదలవుతుందని తెలుస్తున్నది.
తాజాగా సేల్స్, పార్టనర్ షిప్ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించడానికి ఎలన్ మస్క్ రంగం సిద్ధం చేసుకున్నారని బ్లూంబర్గ్ వార్తా కథనం. ఇందుకోసం ఆయా డిపార్ట్ మెంట్ల హెడ్స్ అనుమతిని కోరుతూ ఆయన లేఖలు రాశారని సమాచారం.
కానీ ఎలన్ మస్క్ ప్రతిపాదనను సేల్స్ విభాగం హెడ్ రాబిన్ వీలర్, పార్టనర్ షిప్ డిపార్ట్ మెంట్ అధిపతి మ్యాగీ సునీవిక్ తిరస్కరించారని తెలుస్తున్నది. అందువల్లే వీరిద్దరినీ ఎలన్ మస్క్ సంస్థ నుంచి బయటకు సాగనంపారని ట్విట్టర్ సంస్థలోని విశ్వసనీయ వర్గాలు చెప్పారు.
అసలు గత నెలలోనే ట్విట్టర్‌ను వీడాలని రాబిన్ వీలర్ నిర్ణయించుకున్నారు. కానీ, సంస్థ యాజమాన్యం ఆమెను బుజ్జగించారని, సంస్థలో కొనసాగేలా ఒప్పించారని సమాచారం. ట్విట్టర్ సంస్థలో వచ్చిన మార్పులతో.. ఆ సంస్థకు దూరమైన ప్రకటనకర్తలతో ఎలన్ మస్క్ మాట్లాడటానికి రాబిన్ వీలరే తోడ్పాటు అందించారని తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే, మార్పులకు అనుగుణంగా కష్టపడి పని చేయాలని ఇటీవల ట్విట్టర్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ సూచనలు చేశారు. ఈ విషయమై రాత పూర్వక హామీ ఇవ్వాలని కూడా ఉద్యో్గులను కోరారు. కష్టపడలేకపోతే సంస్థ నుంచి వెళ్లిపోవాలని హుకూం జారీ చేశారు. మస్క్ తీరును వ్యతిరేకిస్తున్న చాలా మంది ఉద్యోగులు వెళ్లిపోయేందుకు సిద్ధం అయ్యారని సమాచారం.