న్యూఢిల్లీ, నవంబర్ 3: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూప్ సంస్థలకు చెందిన రూ.3,000 కోట్లకుపైగా ఆస్తులు, సంబంధిత ఈక్విటీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్నట్టు సోమవారం తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ముంబైలోని పాలీ హిల్‌లోగల అంబానీ కుటుంబ నివాసం, మరికొన్ని ఇండ్లు, కంపెనీ వాణిజ్య ఆస్తులు సహా మొత్తం 42 ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టు అక్టోబర్ 31నే ఈడీ నాలుగు ప్రొవిజనల్ ఆర్డర్లు ఇచ్చింది. ఢిల్లీలోని మహారాజ రంజిత్ సింగ్ మార్గ్‌లోగల రిలయన్స్ సెంటర్‌కు చెందిన భూమి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన వివిధ ప్రాపర్టీలూ ఈడీ జప్తు చేసిన వాటిలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా..
నోయిడా, ఘజియాబాద్, పుణె, థానే, హైదరాబాద్ (క్యామస్ క్యాప్రీ అపార్ట్మెంట్స్), చెన్నై, తూర్పు గోదావరి జిల్లాల్లో అంబానీ, ఆయనకు చెందిన కంపెనీల ఆస్తులు జప్తు అయ్యాయి. వీటిన్నిటి విలువ రూ.3,083 కోట్లుగా ఉంటుందని ఓ ప్రకటనలో ఈడీ పేర్కొన్నది. దీనిపై అంబానీగానీ, ఆయన గ్రూప్‌గానీ ఇప్పటిదాకా స్పందించలేదు. కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ వంటి అంబానీ గ్రూప్ సంస్థలు ప్రజా ధనాన్ని మోసపూరితంగా దారి మళ్లించాయని ఈడీ గుర్తించింది. జైపూర్-రీన్గస్ హైవే ప్రాజెక్ట్ నుంచి రూ.40 కోట్లను రిలయన్స్ ఇన్ఫ్రా దుర్వినియోగం చేయడంపై ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ చట్టం (ఫెమా) కింద చర్యలు చేపట్టినట్టు ఈడీ చెప్తున్నది.
హవాలా నెట్వర్క్..
సూరత్‌కు చెందిన నకిలీ సంస్థల ద్వారా నిధులను దుబాయ్‌కి చేరవేశారని, తమ విచారణలో రూ.600 కోట్లకుపైగా ఉన్న విస్తృత స్థాయి అంతర్జాతీయ హవాలా నెట్వర్క్ బయటపడిందని ఈడీ ఈ సందర్భంగా తెలిపింది. 2010-12 మధ్య రిలయన్స్ కమ్యూనికేషన్స్ వివిధ భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పుల్ని తీసుకున్నదని, వాటికి సంబంధించి ఇంకా రూ.19,694 కోట్ల బకాయిలున్నాయని వివరించింది. ఇవన్నీ కూడా మొండి బకాయిలుగా మారాయన్న ఈడీ.. ఐదు బ్యాంకులు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను మోసపూరిత రుణగ్రహీతగా ప్రకటించాయని గుర్తుచేసింది.