Gold Seize | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విదేశీ మారక ద్రవ్యం ట్రేడర్ నివాసం, ఆఫీసులపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దాడులు చేసింది. చట్ట విరుద్ధంగా ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై జరిపిన దాడుల్లో రూ.3.10 కోట్ల విలువైన నగదు, ఇతర ఆస్తుల పత్రాలు జప్తు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ సంస్థతో అనుబంధం గల ఇండ్లు, ఆఫీసులపై హవాలా లావాదేవీల నిరోధక చట్టం-2002 (పీఎంఎల్ఏ) కింద దాడులు చేసి, సోదాలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది.
ఈ ఆపరేషన్‌లో రూ.1.36 కోట్ల నగదు, రూ.71 లక్షల విలువ చేసే 1.2 కిలోల బంగారం, రూ.89 లక్షల విలువ గల రెండు లగ్జరీ కార్లు, బ్యాంకు ఖాతాలో రూ.14.72 లక్షలు జప్తు చేశామని ఈడీ వివరించింది. టీబీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ సంస్థ ఫారెక్స్ ట్రేడింగ్ నిర్వహించడానికి ఆర్బీఐ నుంచి అనుమతి లేదని తెలిపింది. ఫారెక్స్ డీలర్‌గా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని పేర్కొంది. తాము జరిపిన దాడుల్లో నేరాభియోగాలకు సంబంధించిన పత్రాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.
మెస్సర్స్ టీఎం ట్రేడర్స్, మెస్సర్స్ కేకే ట్రేడర్స్లపై కోల్‌కతా పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ కేసు దర్యాప్తు చేపట్టింది. మరోవైపు టీపీ గ్లోబల్ ఎఫ్ఎక్స్ సంస్థపై ఆర్బీఐ ‘అలర్ట్ లిస్ట్’ జారీచేసింది.ఈ సంస్థతో ఫారెక్స్ లావాదేవీలు జరిపే వారు అప్రమత్తంగా ఉండాలంటూ ఆర్బీఐ హెచ్చరించింది.
ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట ప్రజలను మోసగించేందుకు ప్రసేన్ జిత్ దాస్, శైలేష్ కుమార్ పాండే, తుషార్ పటేల్ తదితరులు షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది. ప్రజల నుంచి ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట సేకరించిన నిధులను వ్యక్తిగత ఆస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించుకున్నారని ఈడీ పేర్కొన్నది. ఇంతకుముందే పాండే, దాస్ లను మరో కేసులో ఈడీ అరెస్ట్ చేయగా, వారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని ఈడీ తెలిపింది.