ముంబై, మార్చి 9: నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరేండ్ల క్రితం జరిపిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం..దేశ ఆర్థికాభివృద్ధికి గండికొట్టిందని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పలు ఆర్థికాంశాలపై ఆయన తాజాగా ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వాస్తవానికి మన వృద్ధి పనితీరు కొద్దికాలం నుంచి బలహీనంగా ఉంది. 2016 డీమానిటైజేషన్ తర్వాత ఆర్థికాభివృద్ధి ఎన్నడూ పటిష్ఠంగా కోలుకోలేదు’ అన్నారు. భారత్ వృద్ధిపై ఆందోళన చెందుతున్నారా అని అడిగిన ప్రశ్నకు రాజన్ ఇలా బదులిచ్చారు. అధిక ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం-ఈ మూడూ భారత్‌ను వేధిస్తున్న సమస్యలని, రష్యా-ఉక్రెయిన్ ఉదంతం నేపథ్యంలో వీటిని అదుపు చేయడానికి జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని రాజన్ సూచించారు.