భారతీయ విమానయాన రంగం బలోపేతానికి అంతర్జాతీయ మార్గాల్లో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రావాలి.
టెలీకమ్యూనికేషన్స్ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనకు పెట్టుబడుల అవసరం ఉన్నది. దేశంలో 6జీ సేవలకు మార్గం సుగమం కావాలి.
నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రైవేట్ రంగం నుంచి అధిక పెట్టుబడులు, కొత్తగా వస్తున్న వనరులను అందిపుచ్చుకోవడం అవసరం.
భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటి పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలి.
రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై చైనా, అమెరికాలతో పోల్చితే భారత్ చేస్తున్న ఖర్చు తక్కువ. ప్రైవేట్ రంగ పెట్టుబడులూ నిరాశజనకం.
Economic Survey | న్యూఢిల్లీ, జూలై 22: దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 6.5-7 శాతం మధ్యే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లోని 8.2 శాతంతో పోల్చితే 1.7-1.2 శాతం తగ్గడం గమనార్హం. సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అయితే మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించనున్న క్రమంలో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని తెలియపర్చే కీలక సర్వేలో వృద్ధిరేటు అంచనాలు పడిపోవడం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
ఈ ఆర్థిక సంవత్సరానికి అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.2 శాతం), ఇటు ఐఎంఎఫ్, ఏడీబీ (7 శాతం)లు విడుదల చేసిన అంచనాలకన్నా మోదీ సర్కారు అంచనా తక్కువగా ఉన్నదిమరి. కాగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. భారత జీడీపీ వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొన్నది. అయితే ఇన్నాళ్లూ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ఊదరగొట్టిన బీజేపీ ప్రభుత్వానికి.. వాస్తవ పరిస్థితులు మింగుడుపడకుండా తయారయ్యాయన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో దేశ వృద్ధిరేటును వాస్తవం కన్నా ఎక్కువచేసి చూపుతున్నారన్న పలువురు ప్రముఖ ఆర్థికవేత్తల అభిప్రాయాలకూ ఇప్పుడు బలం చేకూరుతున్నది. మొత్తానికి ఈసారి భారత జీడీపీ 7 శాతంలోపేనని మోదీ సర్కారు ముందస్తు సంకేతాలను ఈ తాజా సర్వేతో ఇచ్చేసింది.

వరుస ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూపోతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఆర్థిక సర్వే ఓ కీలక సూచన చేసింది. వడ్డీరేట్లను నిర్ణయించేటప్పుడు ఆహార ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం ఆపేయాలన్నది. గత ఏడాది ఏప్రిల్ నుంచి రెపో రేటును ఆర్బీఐ.. ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా గరిష్ఠ స్థాయి (6.5 శాతం)లోనే ఉంచుతున్న విషయం తెలిసిందే. 2016 నుంచి ద్రవ్యోల్బణ ఆధారిత ద్రవ్యవిధానాన్ని ఆర్బీఐ ఆచరిస్తూ వస్తున్నది. దీంతో బ్యాంక్ రుణాల వడ్డీరేట్లూ అత్యధిక స్థాయిలోనే ఉంటున్నాయి. ఫలితంగా రుణగ్రహీతలపై ఈఎంఐల భారం తడిసి మోపెడవుతున్నది. అలాగే ఆయా రంగాలను నిధుల కొరత కూడా వేధిస్తున్నది. ఈ క్రమంలో ఇకపై ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవద్దని ఆర్బీఐకి కేంద్రం సూచించింది. ఇదిలావుంటే అధిక ఆహారోత్పత్తుల ధరలను ఎదుర్కొనేలా పేదలకు కూపన్లు లేదా నేరుగా నగదు బదిలీని కేంద్ర ప్రభుత్వం చేయాలని కూడా ఆర్థిక సర్వే సూచించింది. దీంతో వచ్చే నెల ఆర్బీఐ ద్రవ్యసమీక్షకు ప్రాధాన్యత ఏర్పడుతున్నది. ఇక వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున ఆహారోత్పత్తుల ధరలు దిగివస్తాయన్న ఆశాభావాన్నీ కేంద్రం ఈ సందర్భంగా కనబర్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఎగుమతులు పెరుగాలన్నా.. స్థానికంగా తయారీ రంగం బలపడాలన్నా.. పొరుగు దేశం చైనా సహకారం అవసరమని ఆర్థిక సర్వేలో కేంద్రం పేర్కొనడం విశేషం. ఈ క్రమంలోనే చైనా నుంచి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆకర్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే సరిహద్దుల్లో చైనాతో కుస్తీ పడుతూ.. వ్యాపార రంగంలో దోస్తీ చేయాలన్న వింత వాదనపై ఇప్పుడు ఒకింత విస్మయం వ్యక్తమవుతున్నది. చైనా సంస్థలు భారత్‌లో పెట్టుబడుల ద్వారా వేళ్లూనుకుంటే మున్ముందు విపరీత పరిణామాలేనన్న ఆందోళనలూ కనిపిస్తున్నాయి. నిజానికి భారత్‌తో సరిహద్దును పంచుకుంటున్న దేశాల నుంచి పెట్టుబడులకు.. ఏ రంగంలోనైనా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి.
దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) సంఖ్య పెరుగడంలో గత తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధానం భేష్ అని ఆర్థిక సర్వే కొనియాడింది. నేడు బహుళజాతి సంస్థలు భారత్‌లో తమ జీసీసీలను ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తున్నాయంటే దాని వెనుక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాల కృషి ఎంతో ఉన్నదని ఆర్థిక సర్వే ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో డాటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన పరిస్థితుల్ని కల్పించిన సంగతి విదితమే. దీంతో ఎన్నో ప్రముఖ సంస్థలు ఇక్కడ జీసీసీలను నెలకొల్పాయి. కాగా, 2012లో దేశంలో దాదాపు 720 జీసీసీలుండగా, 2023 నాటికి అవి 1,600లకు పెరిగాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికం, ఏరోస్పేస్, ఆటోమోటివ్, హెల్త్‌కేర్, ఫార్మా, చమురు-గ్యాస్, బీపీవో, ఇంజినీరింగ్ ఉత్పత్తులకు ఇవి దన్నుగా నిలుస్తున్నాయి.
టెక్నాలజీ రంగంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న కృత్రిమ మేధస్సు..ఉద్యోగులకు షాపంగా మారింది. అన్ని రంగాల్లో ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఈ టెక్నాలజీ మింగేస్తున్నదని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో ఉద్యోగ కల్పనపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపొచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. కార్పొరేట్ రంగ సంస్థలు ఏఐ కార్మికులను స్థానభ్రంశం చేయడం కంటే శ్రమను పెంచే మార్గాల గురించి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. మరోవైపు, ఐటీ రంగ సంస్థలు గత రెండేండ్లుగా ఉద్యోగ నియామకాలను తగ్గించాయని సర్వే వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో ప్రతిభ కలిగిన ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని పేర్కొంది. మరోవైపు, 2030 నాటికి ప్రతియేటా వ్యవసాయేతర రంగాల్లో 78 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉన్నదని సర్వే అభిప్రాయపడింది. ఈ ఉద్యోగ కల్పనలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపింది.
చైనా నుంచి ఎఫ్‌డీఐలకు సంబంధించి అనుసరించాలనుకుంటున్న విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని కోరుతున్నా. వస్తూత్పత్తుల దిగుమతులు, పెట్టుబడుల మధ్య సమతూకం అవసరం. ఇప్పటికే చైనాతో భారత్ ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్నది. ఇంకా ఆ దేశం నుంచి దిగుమతులు చేసుకుంటే లోటు మరింత పెరుగుతుంది. దీంతో దేశీయంగా ఒడిదొడుకులు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయో తెలుసుకుంటే ఉత్తమం. ఇది భారతీయ వ్యాపార, పారిశ్రామికవేత్తలకూ లాభిస్తుంది. అంతేగాని చైనా ఎఫ్‌డీఐలను ఆకర్షించాలని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
-వీ అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు
చైనా నుంచి భారత్‌లోకి పెట్టుబడులు స్వల్ప కాలానికి ప్రయోజనం చేకూర్చినా.. దీర్ఘకాలంలో నష్టాలనే మిగులుస్తాయి. డ్రాగన్ ఎఫ్‌డీఐలు భారత ఆర్థిక భద్రతకు, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి ఇబ్బందే. పైగా తయారీ రంగంలో చైనాపై ఆధారపడే పరిస్థితి ఎంతో ప్రమాదకరం. భౌగోళిక రాజకీయ సమస్యలకు, సరఫరా ఒడిదొడుకులకు దారితీస్తుంది. అంతేగాక చైనా సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెడితే అక్కడి సాంకేతిక నిపుణులు, సిబ్బందినే ఇక్కడికి తెచ్చుకుంటాయి. మనవాళ్లకు ఆ మెలకువల్ని నేర్పించేందుకు ఇష్టపడవు. ఇది దేశంలో నిరుద్యోగాన్ని పెంచేందుకు కారణం కాగలదు.
-అజయ్ శ్రీవాత్సవ, గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకుడు