హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని, ఇందుకోసం వచ్చే ఐదేండ్లలో రూ.600 కోట్ల నిధులను కేటాయించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..టీఎస్ ఐపాస్ సింగిల్ విండో వ్యవస్థ ద్వారా కంపెనీలకు 21 రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయని, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ ద్వారా సాంకేతికత సహాయంతో మరింత పారదర్శకత, పెండింగ్ అనుమతుల రియల్ టైమ్ ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు.
ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం వాటా కలిగివున్నదని, 2047 నాటికి ఈ వాటా 10 శాతానికి రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడంతో భూమి కొనుగోలు చేయకుండా లీజుకు తీసుకునే విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్క్‌ల్లో నాలుగో వంతు మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆర్థిక సహాయం, సాంకేతికతను అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఎంఎస్ఎంఈలకు సహాయం చేసేందుకు ‘ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్’ను ప్రభుత్వం ప్రారంభించినట్టు ఆయన వివరించారు.