Gold Seizure | ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 3.35 కిలోల బంగారాన్ని జప్తు చేశారు. దీని విలువ రూ.2.1 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారులకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా విమానాశ్రయంలో తనిఖీలు చేశారు.
డ్యూటీ ఫ్రీ షాప్, ఫుడ్ కోర్టు ఉద్యోగులతోపాటు ఒక ప్రయాణికుడ్ని పట్టుకుని తనిఖీ చేశారు డీఆర్ఐ అధికారులు. సదరు ప్రయాణికుడి వద్ద నుంచి సదరు బంగారాన్ని జప్తు చేసినట్లు తెలిపారు. సదరు వ్యక్తి బంగారాన్ని పేస్ట్ రూపంలో స్మగ్లింగ్ చేస్తుండగా రికవరీ చేసినట్లు చెప్పారు. ఇది 3.35 కిలోలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. విమానాశ్రయ సిబ్బంది.. ఈ స్మగుల్డ్ బంగారాన్ని విమానాశ్రయం ఆవలకు తరలించి.. వేర్వేరు ప్రాంతాల్లో ఇతర వ్యక్తులకు అందజేస్తారని పేర్కొన్నారు.
బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకోవడంతో విదేశాల నుంచి దేశంలోకి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. గత వారం ముంబై ఎయిర్ పోర్టులో 16.30 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా 18 మంది సుడాన్ మహిళలను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.