Life Insurance Policy | ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అధిక మొత్తాల్లో ఉన్న ప్రీమియంలు చెల్లించలేకపోతున్నవారు, పాలసీ అనవసరంగా భావించినవారు.. తమ జీవిత బీమా పాలసీలను సరెండర్ చేస్తూంటారు. మరికొందరు అమ్ముతూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏది లాభం? నిపుణులు ఏం చెప్తున్నారు.
మీ జీవిత బీమా పాలసీని సరెండర్ చేయడం కన్నా.. అమ్ముకుంటే ఎక్కువ మొత్తంలో నగదును పొందగలరని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీని సరెండర్ చేయడం అంటే మీ కవరేజీని రద్దు చేసుకోవడమే. మీ పాలసీ పత్రాలను తిరిగి సదరు కంపెనీకే ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను మీకు ఆ బీమా పాలసీని అమ్మిన సంస్థ.. వెంటనే దాని సరెండర్ విలువను చెల్లిస్తుంది. సంస్థ నిర్ణయించినదే వస్తుంది. ఎలాంటి సంప్రదింపులకు ఆస్కారం లేదు. ఈ క్రమంలో ఏవైనా చార్జీలు పడితే వాటిని ఆ మొత్తం నుంచి మినహాయించుకుంటుంది కూడా. దీంతో మీకు తక్కువ నగదు మొత్తాలు రావచ్చు.
మీకు అనవసరంగా అనిపించిన లేదా మీరు భారంగా భావించిన మీ పాలసీని సరెండర్ చేయకుండా సెకండరీ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా వీలున్నది. దీన్ని లైఫ్ ఇన్సూరెన్స్ సెటిల్మెంట్గా పిలుస్తారు. సరెండర్ చేస్తే మీకు త్వరితగతిన మీరు చెల్లించిన నగదు తిరిగి రావచ్చుగానీ.. అమ్ముకుంటే మాత్రం ఎక్కువ మొత్తంలో నగదును పొందే అవకాశం ఉంటుంది. ఇక అమ్ముకుంటే మీ పాలసీ ప్రీమియంలన్నీ కూడా దాన్ని కొన్నవారే చెల్లిస్తారు. అలాగే మీరు చనిపోయినప్పుడు మీ మరణానంతర ప్రయోజనాలన్నీ కూడా పాలసీని కొన్నవారికే అందుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాలసీ యాజమాన్య హక్కులను మీరు అమ్ముకుంటున్నారన్నమాట.
సెకండరీ మార్కెట్లో జీవిత బీమా పాలసీల్లో తమ నగదును పెట్టుబడిగా పెట్టే ప్రైవేట్ ఇన్వెస్టర్లు కొంటారు. అలాగే ప్రైవేట్ సెల్లర్ల నుంచి జీవిత బీమా పాలసీలను కొనే లైఫ్ సెటిల్మెంట్ కంపెనీలుంటాయి. బ్రోకర్ల ద్వారా ఈ లావాదేవీలు జరుగుతాయి. ఇక బ్యాంకులు లేదా క్రెడిట్ యూనియన్ల వంటి ఇతర ఆర్థిక సంస్థలూ కొంటాయి. కాగా, వయస్సు, ఆరోగ్య పరిస్థితులనుబట్టి కూడా పాలసీలకు సెకండరీ మార్కెట్లో ధరలు పలుకుతాయి. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ కాబట్టి అధిక మొత్తాల్లో చెల్లించి పాలసీలను కొనేందుకు బయ్యర్లు ముందుకొస్తారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే తక్కువ మొత్తాల ప్రీమియంలతో కూడిన పాలసీలున్నా.. ఆకర్షణీయ ధర లభిస్తుంది. పాలసీకున్న మరణానంతర ప్రయోజనాలనుబట్టి కూడా ధరలు పెరుగుతాయి. పాలసీ సెల్లర్లు సంప్రదింపుల ద్వారా కూడా తమ పాలసీ ధరల్ని పెంచుకోవచ్చు.
పాలసీని సరెండర్ చేయడమో లేదా అమ్ముకోవడమో అనేది పాలసీదారులకు చిట్టచివరి మార్గంగా మాత్రమే ఉండాలి. ప్రతీ చిన్న అవసరం కోసం జీవిత బీమా పాలసీలను వదులుకోరాదు. అలాగే ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తే మరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలనైనా వారు సూచించగలరు. అలా నిధుల అవసరాలను తీర్చుకోవచ్చేమోనని కూడా ప్రయత్నిస్తే మంచిది. దీనివల్ల కుటుంబానికి మేలు చేసినవారు అవుతారు. మీరు లేని సమయంలో మీ వాళ్లకు భరోసా ఒక్క బీమా మాత్రమేనన్నది మరువద్దు.