న్యూఢిల్లీ/ముంబై, ఏప్రిల్ 7: స్టాక్ మార్కెట్లను ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు షేక్ చేస్తున్నాయి. కొనుగోళ్లను పక్కనపెట్టి మదుపరులు అమ్మకాలకు తెగబడుతున్నారు. సోమవారం నాటి నష్టాలే ఇందుకు నిదర్శనం. ఉదయం ఆరంభం నుంచే సెల్లింగ్ ప్రెషర్లోకి జారుకున్న ఇన్వెస్టర్లు.. సూచీలను గడిచిన 10 నెలల్లో ఎన్నడూ లేనంత నష్టాల్లోకి నెట్టేశారు. ఓవైపు ఆర్థిక మందగమనం ఛాయలు, మరోవైపు వాణిజ్య యుద్ధం భయాలు చుట్టుముడుతున్న నేపథ్యంలో మదుపరులకు నిపుణులు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వాటిని పరిశీలిస్తే..
భారతీయ మార్కెట్లకు ఇది ‘బ్లాక్ మండే’. అమ్మకాల దెబ్బకు సూచీలు వణికిపోయాయి. అయితే మదుపరులు, ట్రేడర్లు సంయమనంతో వ్యవహరిస్తే.. ఈ భయోత్పాతం నుంచి తప్పించుకోవచ్చు. ఏదో జరుగబోతున్నదని భయపడి అమ్మకాలకు దిగవద్దు. సిప్‌లను కొనసాగించాలి. డిస్కౌంట్ ధరల్లో బలమైన, స్థిరమైన షేర్లను కొనడంపై దృష్టిపెట్టాలి.
-ప్రణయ్ అగర్వాల్, స్టాక్స్‌కార్ట్ సీఈవో
ప్రస్తుత పరిస్థితులను చూసి మదుపరులు భయపడవద్దు. అయితే పెట్టుబడులపట్ల మాత్రం అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇది అనిశ్చిత పరిస్థితే అని చెప్పవచ్చు. ఎందుకంటే మున్ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయో ఊహించలేకుండా ఉన్నది. అందుకే సంప్రదాయ సాంకేతిక, ఫండమెంటల్ పారామీటర్స్ ఇక్కడ పనిస్తాయని చెప్పలేము. కానీ సిప్‌లలో పెట్టుబడులను కొనసాగించవచ్చు.
-మనీశ్, మీరే అసెట్ క్యాపిటల్ డైరెక్టర్
మదుపరులు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. అందులో ఒకటి.. ట్రంప్ టారిఫ్‌లు ఎంతోకాలం సాగవు. ఇక రెండోది.. అమెరికాకు భారత ఎగుమతులు దేశ జీడీపీలో కేవలం 2 శాతమే. కాబట్టి భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం పెద్దగా ఉండబోదు. మూడోది.. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇది విజయవంతమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదే జరిగితే టారిఫ్‌లు తగ్గిపోతాయి. టారిఫ్‌లు, ద్రవ్యోల్బణం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకెళ్తేనే లాభాలు.
-వీకే విజయకుమార్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్
వివిధ దేశాలపై విధించిన సుంకాల పరిమాణాలపై ట్రంప్ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే అనుకుంటున్నాను. కానీ దీనికి ఎంత సమయం పడుతుంది? అన్నది స్పష్టంగా చెప్పలేము. నిజానికి ప్రభుత్వ విధానాలతో వచ్చే దిద్దుబాట్లు.. కొంతకాలానికి సర్దుకోగలవు. అయితే మార్కెట్లు భయాల గుప్పిట్లో ఉన్నప్పుడే వాల్యుయేషన్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగించాలన్నదే మా సలహా.
-ఎస్ నరేన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ సీఐవో