ముంబై, ఏప్రిల్ 3: దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ట్రంప్ టారిఫ్‌ల సెగ గట్టిగానే తాకింది. దేశీయ దిగుమతులపై 27 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్టు ప్రకటించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 322.08 పాయింట్లు పడిపోయి 76,295.36 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 82.25 పాయింట్లు కోల్పోయి 23,250.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 186 పాయింట్లు కోల్పోయింది. అయితే సూచీలు భారీగా నష్టపోయినప్పటికీ మదుపరుల సంపద పెరగడం విశేషం. బీఎస్ఈ నమోదిత సంస్థల విలువ రూ.35,170.32 కోట్లు పెరిగి రూ.4,13,33.265.92 కోట్లకు చేరుకున్నది.
ఐటీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించడంతో ఈ రంగానికి చెందిన సూచీలు 10 శాతం వరకు నష్టపోయాయి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అత్యధికంగా 9.92 శాతం నష్టపోగా, కాఫోర్జీ 7.77 శాతం, కేపీఐటీ టెక్నాలజీ 7.66 శాతం, టీసీఎస్ 3.98 శాతం, టెక్ మహీం ద్రా 3.79 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేరు 3.71 శాతం, ఇన్ఫోసిస్ 3.41 శాతం, విప్రో 2.75 శాతం చొప్పున నష్టపోయాయి.
బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 1,348.57 పాయింట్లు లేదా 3.78 శాతం నష్టపోయి 34,293.59కి జారుకున్నది. ఇదిలావుంటే అమెరికా మార్కెట్లు గురువారం భీకర నష్టాల్లో కూరుకుపోయాయి. నాస్డాక్ సూచీ 5 శాతం మేర నష్టపోవడం మదుపరులకు ట్రంప్ నిర్ణయం రుచించలేదని అర్థమైంది.