స్టాక్ మార్కెట్లలో నష్టాలు ఏరులై పారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరతీసిన ప్రతీకార సుంకాలు.. సోమవారం భారత్‌సహా ప్రధాన ఆసియా దేశాల మార్కెట్లను బలితీసుకున్నాయి. ఇప్పటికే ఐరోపా, అమెరికా మార్కెట్లు టారిఫ్‌ల దెబ్బకు కుదేలైపోగా.. వరుస నష్టాలతో మదుపరులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపద ఆవిరైపోయింది. అగ్రరాజ్యం దూకుడుకు దీటుగా చైనా, మరికొన్ని దేశాలు స్పందిస్తున్నాయి. దీంతో ఈక్విటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సెన్సెక్స్ 2,227, నిఫ్టీ 743 పాయింట్లు పతనమైపోయాయి. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల షేర్లు నష్టాలకే పరిమితమైపోయాయి.
ట్రంప్ దూకుడుకు దీటుగా చైనా, మరికొన్ని దేశాలు స్పందిస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఫలితంగా అమెరికా, ఆసియా, ఐరోపా సూచీల్లో భారీ అలజడే నెలకొంటున్నది. వాణిజ్య యుద్ధం భయాల నడుమ మదుపరులు అమ్మకాలకు తెగబడుతున్నారు. సోమవారం భారతీయ సూచీలు భీకర నష్టాలను చవిచూడగా.. ఈ ఒక్కరోజే సెన్సెక్స్ 2,227, నిఫ్టీ 743 పాయింట్లు పతనమైపోయాయి. మదుపరుల సంపద కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది.
Trump Tariffs | ముంబై, ఏప్రిల్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భీకర నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన టారిఫ్ ప్రకంపనలు యావత్తు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం భారతీయ సూచీలపైనా పడింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,226.79 పాయింట్లు లేదా 2.95 శాతం నష్టపోయి 73,137.90 వద్ద ముగిసింది. ట్రేడింగ్ ఆరంభంలోనైతే ఏకంగా 3,939.68 పాయింట్లు (5.22 శాతం) కోల్పోవడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ కూడా 742.85 పాయింట్లు లేదా 3.24 శాతం పడిపోయి 22,161.60 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 1,160.80 పాయింట్లు (5.06 శాతం) క్షీణించింది. దీంతో గత ఏడాది జూన్ 4 (10 నెలలు) తర్వాత ఈ స్థాయిలో సూచీలు కుదేలవడం ఇదే తొలిసారైంది.
ఉదయం ఆరంభం నుంచే భారీ నష్టాల్లో కదలాడిన సూచీలు.. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేకపోయాయి. అయితే సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల తీవ్రత మాత్రం తగ్గింది. కాగా, ఈ నెల 2న ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలను ట్రంప్ ప్రకటించిన సంగతి విదితమే. అయితే దీనికి బదులిస్తూ చైనా కూడా దీటుగా స్పందించింది. దీంతో ఆర్థిక మందగమనం భయాలు ఒక్కసారిగా గ్లోబల్ మార్కెట్‌ను హీటెక్కించాయి. ఇదే సమయంలో ఇన్వెస్టర్లను ట్రేడ్‌వార్ భయాలూ చుట్టుముట్టాయి. అలా చెలరేగిన అమ్మకాల ఒత్తిడే మండే మార్కెట్లను ముంచేసింది.
టారిఫ్‌ల దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. 775 షేర్లు అయితే ఏడాది కనిష్ఠానికి జారుకున్నాయి. వీటిలో దేశీయ అగ్రగామి సంస్థయైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ఠ స్థాయి రూ.1,115.55కి పడిపోయిన ఆర్ఐఎల్ షేరు చివరకు 4.13 శాతం నష్టంతో రూ.1,155 వద్ద ముగిసింది. అలాగే టీసీఎస్ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.3,060.25కి జారుకోగా, ఇన్ఫోసిస్ షేరుకూడా రూ.1,307.10కి పడిపోయింది. వీటితోపాటు లార్సెన్ అండ్ టుబ్రో, టాటా గ్రూపునకు చెందిన టైటాన్, టాటా మోటర్స్ షేర్లు భారీగా నష్టపోవడంతో వీటి మార్కెట్ విలువ రూ.41.81 లక్షల కోట్లు ఆవిరైంది. అయినప్పటికీ 59 కంపెనీల షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం విశేషం.
స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ విమర్శించింది. మార్కెట్లు నష్టపోవటం చూసి తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థల పతనం.. స్వయంగా చేసుకున్న గాయాలుగా ఆయన అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీ చర్యల కారణంగా మార్కెట్లు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నాయని ఆరోపించారు. టారిఫ్‌లకు తగ్గట్టుగానే మార్కెట్లు స్పందిస్తున్నాయని అన్నారు. ‘ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మంచి స్నేహితులుగా అభివర్ణించటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఇద్దరూ తమ ఆర్థిక వ్యవస్థలు పతనం కావడానికి స్వయంగా సమస్యలు సృష్టించుకోవటంలో నిపుణులు.
వ్యాధి నయం కావాలంటే మందు చేదుగా ఉన్నప్పటికీ, తీసుకోవలిసిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన ఇటీవల వివిధ దేశాల దిగుమతులపై సుంకాలను విధించడంతో అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యలోటు గాడిలో పడే వరకు సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ మార్కెట్ల పతనాన్ని తాను కోరుకోలేదని, భారీ అమ్మకాల గురించి ఆందోళనకు గురికావడం లేదని చెప్పారు. తాను ఐరోపా, ఆసియా దేశాల అధినేతలతో చర్చించానని, ఇప్పుడు వారంతా అమెరికాతో ఒప్పందాల కోసం ఆత్రుతపడుతున్నారని తెలిపారు.
మెటల్ షేర్లను మదుపరులు గట్టిగానే దూరం పెట్టారు. దీంతో బీఎస్ఈలో మెటల్ సూచీ గరిష్ఠంగా 6.22 శాతం నష్టపోయింది. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ షేర్ విలువ అత్యధికంగా 8.18 శాతం పడిపోగా, ఆ తర్వాత టాటా స్టీల్ 7.73 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 7.58 శాతం, సెయిల్ 7.06 శాతం, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ 6.90 శాతం చొప్పున క్షీణించాయి. వేదాంత, జిందాల్ స్టెయిన్లెస్, హిందాల్కో, ఎన్ఎండీసీ, హిందుస్థాన్ జింక్ షేర్లూ నిరాశపర్చాయి. అలాగే ఐటీ షేర్లలో ఆన్వర్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్ విలువ గరిష్ఠంగా 13.99 శాతం పడిపోయింది. జెన్సెస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ షేర్ కూడా 10.80 శాతం నష్టాలను చవిచూసింది. టాటా టెక్నాలజీస్ (6.19 శాతం), ఎంఫసిస్ (5.76 శాతం) షేర్లూ కుదేలయ్యాయి. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్ 3.75 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 3.27 శాతం, టెక్ మహీంద్రా 2.47 శాతం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 1.72 శాతం, విప్రో 1.38 శాతం, టీసీఎస్ 0.69 శాతం చొప్పున క్షీణించాయి.
దేశీయ మదుపరులకు గడ్డుకాలం ఇది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఇప్పటి వరకు మదుపరులకు నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది జనవరి 20 నుంచి ఇప్పటి వరకు సూచీలు భీకరనష్టాల్లోకి జారుకోవడంతో మదుపరులు ఏకంగా రూ.45 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. జనవరి 20న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.4,31,59,726 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం ఇది రూ.3,86,01,961 కోట్లకు పడిపోయింది. నికరంగారూ.45 లక్షల కోట్లకు పైగా తగ్గిపోయింది. ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం స్టాక్ మార్కెట్లకు రుచించడం లేదు. ఆయన వివాదాస్పద నిర్ణయాలు ఒక్కొక్కటి తీసుకుంటుండటం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నది. హెచ్1-బీ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంతోపాటు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపడం, మరోసారి అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశాలున్నట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లను షేక్ చేస్తున్నది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపరులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల సంపదను కోల్పోయిన ఇన్వెస్టర్లకు సోమవారం మరో రూ.14 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సూచీల ప్రారంభంలోనే రూ.20 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయిన మదుపరులు చివరకు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.14,09,225.71 కోట్లు కరిగిపోయి రూ.3,89,25,660.75 కోట్ల(4.54 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది.
దేశీయ కుబేరులకు 2025 అచ్చిరావడం లేదు. గతేడాది రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు నూతన సంవత్సరంలో పాతాళంలోకి పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన నాటి నుంచి సూచీలు అల్లకల్లోలానికి గురయ్యాయి. ఫలితంగా దేశీయ కుబేరులు లక్ష కోట్లకు పైగా సంపదను కోల్పోయినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్‌లో వెల్లడించింది.
దేశీయ శ్రీమంతుల జాబితాలో అగ్రగామిగా వెలుగొందుతున్న ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడర్ల వేలాది కోట్ల సంపద హరించుకుపోయింది. వీరిలో హెచ్‌సీఎల్ టెక్నాలజీ అధినేత శివ్ నాడర్ అత్యధికంగా రూ.80 వేల కోట్ల పైగా సంపదను కోల్పోయారు. దీంతో ఆయన సంపద 33.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ 4.45 బిలియన్ డాలర్ల సంప ద హరించుకుపోగా, ముకేశ్ అంబానీ 3.77 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.