ఇది మాకు స్వాతంత్య్ర దినం. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఈరోజు అమెరికా పరిశ్రమకు పునర్జన్మ. శత్రుత్వం, మైత్రి అన్న తేడా లేకుండా దశాబ్దాలుగా అధిక సుంకాలతో అమెరికాను దోచుకున్న దేశాలపై బదులు తీర్చుకునే సమయం. ఇకపై మా నుంచి అడ్డగోలుగా దిగుమతి సుంకాలు వసూలు చేస్తే అదే రీతిలో వారిపైనా ఆ సుంకాల భారం ఉంటుంది.
-వైట్‌హౌజ్‌లోని రోజ్ గార్డెన్లో మాట్లాడుతూ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. తమపై ఏండ్ల తరబడి అధిక పన్నులు వేస్తున్నారంటూ రగిలిపోతున్న అగ్రరాజ్యాధినేత.. ప్రతీకార సుంకాలతో ప్రపంచ వాణిజ్య యుద్ధానికి అగ్గి రాజేశారు.
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా 184 దేశాలపై కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 50 శాతం వరకు అదనపు టారిఫ్‌లను తాజాగా అమెరికా సర్కారు ప్రకటించింది మరి. జనాల్లేని దీవులనూ వదలకపోవడం అగ్రరాజ్యం పెద్దరికాన్ని అవహేళన చేస్తుండగా.. కనీస ఆర్థిక అసమానతల్నీ మరిచి వాణిజ్య భాగస్వామ్య దేశాలతో కఠిన సుంకాల విధానాన్ని అనుసరించడం ట్రంప్‌కే చెల్లింది.
చైనాపై మొదట్నుంచీ ఒంటికాలుపై లేస్తున్న ట్రంప్.. తాజా టారిఫ్‌ల్లోనూ గట్టిగానే వడ్డించారు. ఈ దెబ్బతో అమెరికాకు చేరే డ్రాగన్ వస్తూత్పత్తులపై సుంకాలు అత్యధికంగా 54 శాతానికి చేరాయి. ఇక భారత్‌పై మరో 27 శాతం సుంకాలు పడగా.. స్నేహితుడి దూకుడును అడ్డుకోవడంలో మోదీ దౌత్యం వైఫల్యానికి ఇది నిదర్శనంగా మిగిలింది. అయితే పాత శత్రుత్వానికి తెరదించుతూ కొత్త మైత్రికి బాటలువేస్తూ రష్యాకు ఈ టారిఫ్‌ల నుంచి అమెరికా మినహాయింపునివ్వడం విశేషం. కెనడా, మెక్సికో, ఉత్తర కొరియా, క్యూబా తదితర దేశాలకూ ఇదే మర్యాద దక్కడం వెనుక అగ్రరాజ్యం ప్రయోజనాలు ఉండే ఉంటాయి. అయితే తమపై సుంకాల భారాన్ని మోపిన అమెరికాకు గట్టిగానే బదులిస్తామని ఆయా దేశాలు చెప్తుండటం మరింత ముదిరే వరల్డ్ ట్రేడ్ వార్‌కు సంకేతాలనే ఇస్తున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.
Donald Trump | న్యూఢిల్లీ/న్యూయార్క్/వాషింగ్టన్, ఏప్రిల్ 3: ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేచింది. ప్రతీకార సుంకాలకు డెడ్‌లైన్ (ఏప్రిల్ 2) పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పనీ చేశారు. 184 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త టారిఫ్‌ల విధానాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్, చైనా, ఐరోపా దేశాల (ఈయూ)పై గట్టిగానే వడ్డించిన అగ్రరాజ్యం.. 60కిపైగా దేశాలపై టారిఫ్‌లను భారీగా పెంచడం గమనార్హం. కాగా, తమపై వేస్తున్న సుంకాల్లో సగం మేరకే ఆయా దేశాలకు వర్తింపజేసిన ట్రంప్.. ఇంకొన్నింటిపై సమానంగా, మరికొన్నింటిపై ఎక్కువగా ప్రకటించారు. ఇలా కనిష్ఠంగా 10 శాతం, గరిష్ఠంగా 50 శాతం అదనంగా నిర్ణయించారు. ఫలితంగా చైనాపై గరిష్ఠంగా 54 శాతం సుంకాలు పడబోతున్నాయి. ఇప్పుడు 20 శాతం సుంకాలే పడుతున్నాయి. అయితే రష్యా, ఉత్తర కొరియా, కెనడా, మెక్సికో, క్యూబా, బెలారస్ తదితర దేశాలకు ఈ సుంకాల నుంచి మినహాయింపునివ్వడం ట్రంప్ సర్కారు కొత్త ప్రయోజనాలకు అద్దం పడుతున్నది.
ఆయా దేశాలపై అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలు ఈ నెల 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 5 నుంచి స్టాండర్డ్ టారిఫ్ రేటు 10 శాతం వర్తిస్తుంది. కాగా, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఉక్కు, అల్యూమినియం, ఆటో తదితర వస్తూత్పత్తులపై ఇప్పటికే అక్కడ 25 శాతం సుంకాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో ఏప్రిల్ 5-8 మధ్య మిగతా వస్తూత్పత్తులపై కనీస టారిఫ్ 10 శాతంతో మొత్తంగా 15 శాతంగా ఉంటుందని సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. అయితే ఏప్రిల్ 9 నుంచి వీటన్నింటిపై అదనంగా 27 శాతం సుంకాలు వచ్చిపడుతాయని చెప్తున్నారు. దీంతో అప్పుడు 32 శాతానికి టారిఫ్‌లు పెరిగిపోతాయని పేర్కొంటుండటం గమనార్హం. దీని ప్రకారం ఉక్కు, అల్యూమినియం, ఆటో తదితర వస్తూత్పత్తులపై సుంకాల భారం తొలుత 35 శాతానికి, ఆ తర్వాత 57 శాతానికి చేరబోతున్నది.
ఫార్మా, సెమీకండక్టర్స్, కాపర్‌తోపాటు చమురు, గ్యాస్, బొగ్గు, ఎల్ఎన్జీ వంటి ఇంధన ఉత్పత్తులపై టారిఫ్‌లకు ట్రంప్ దూరంగా ఉన్నారు. ముఖ్యంగా భారత్‌సహా మరికొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న జనరిక్ ఔషధాల ధరలు పెరగకూడదనే అమెరికా ఫార్మాకు మినహాయింపునివ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికా ప్రజల ఔషధ అవసరాల్లో 70 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. వీటిపై సుంకాలు పడితే ఆ దేశానికే నష్టం. అందుకే ఫార్మాను మినహాయించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో భారతీయ ఫార్మాపై ఇప్పటికైతే భారం తప్పినట్టే అనుకోవచ్చు. ఇక సెమీకండక్టర్స్, ఇంధన ఉత్పత్తుల ప్రయోజనాలూ అమెరికాకే దక్కాలంటే వాటినీ ఈ ట్రేడ్ వార్‌లోకి లాగవద్దని ట్రంప్ భావించారని వివరిస్తున్నారు.
ట్రంప్ సర్కారు ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ వృద్ధిరేటు ప్రమాదంలో పడబోతున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దెబ్బకు 50 బేసిస్ పాయింట్లు క్షీణించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) 6 శాతానికి పరిమితం కావచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం. ఎగుమతులు 2 నుంచి 3 శాతం పతనం కావచ్చని అంటున్నారు. నిజానికి ఈసారి దేశ జీడీపీ 6.5 శాతంగా ఉండొచ్చన్న అంచనాలు ఇప్పటిదాకా వినిపించాయి. కానీ టారిఫ్ వార్‌కు ట్రంప్ తెరతీయడంతో అర శాతం కోత పడింది. ఈ క్రమంలో సుంకాల ప్రభావం పెరిగినకొద్దీ వృద్ధిరేటు అంతకంతకూ తగ్గవచ్చని వారు పేర్కొంటున్నారు.
అమెరికా ప్రకటించిన నూతన టారిఫ్‌లతో భారతీయ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు కుదేలవుతాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రంగం దీర్ఘకాల ప్రయోజనాల కోసం అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించింది.
ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం : టారిఫ్‌లపై కేంద్ర ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: అమెరికా ప్రకటించిన టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై ఏ మేరకు పడుతున్నదో అంచనా వేస్తున్నామని గురువారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. ట్రంప్‌కు అమెరికా ఎలాగైతే తొలి ప్రాధాన్యతో.. ప్రధాని మోదీకి భారత్ కూడా అలాగే మొదటి ప్రాధాన్యతని, దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ ప్రతీకార సుంకాల నేపథ్యంలో అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా వ్యూహాత్మక వైఖరిని భారత్ తీసుకోవాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, ప్రముఖ ఇన్వెస్టర్ మోహన్‌దాస్ పాయ్ సూచించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై ప్రకటించిన టారిఫ్‌ల జాబితాలో హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు కూడా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆస్ట్రేలియా పరిపాలనలో ఉన్న ఈ దీవుల్లో శాశ్వతంగా నివసించే ప్రజలు లేరు. ఇక్కడి జనాభా సున్నా. పెంగ్విన్లు మాత్రమే నివసిస్తున్నాయి. వీటిపైనే టారిఫ్ విధించారా? అంటూ నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. అయితే, ఈ దీవులపై ఎందుకు టారిఫ్ విధించారో అమెరికా ప్రభుత్వం వివరించలేదు. హెర్డ్ దీవి, మెక్‌డొనాల్డ్ దీవులు అంటార్కిటిక్ ఖండం నుంచి దాదాపు 1,700 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఇక్కడ అగ్నిపర్వతాల ప్రభావం ఉంది.