అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలను సృష్టించారు. గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు వాటిల్లిన నష్టాలకు కారణం.. ట్రంప్ ప్రతీకార సుంకాల భయాలేననడంలో ఎలాంటి సందేహం లేదు. తనకు కొరకరాని కొయ్యగా మారిన రష్యాకు చెక్ పెట్టేందుకు ఆ దేశం నుంచి ముడి చమురును కొనకుండా భారత్‌పై ఏకంగా 500 శాతం సుంకాలు వేసేందుకు ట్రంప్ పావులు కదుపుతున్నారు మరి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 2,185.77 పాయింట్లు లేదా 2.54 శాతం పతనమై 83,576.24 దగ్గర ముగిసింది.
నిఫ్టీ 645.25 పాయింట్లు లేదా 2.45 శాతం క్షీణించి 25,683.30 వద్ద నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా అమెరికా భయాలు మదుపరులను వెంటాడే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చు. లాభాల స్వీకరణ దిశగా మదుపరులు వెళ్తే.. సూచీలకు నష్టాలు తప్పవు. ఇక రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, ఇరాన్, అమెరికా మాటకు-మాట, వెనెజువెల వ్యవహారం అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. చమురు-గ్యాస్, ఐటీ, ఆటో రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. కాగా, విదేశీ పెట్టుబడులు, ముడి చమురు ధరలు, రూపీ విలువ, త్రైమాసిక ఫలితాలూ కీలకమే. సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తే నిఫ్టీకి 25,300 పాయింట్ల స్థాయి కీలకం. దిగువన ముగిస్తే 25,100 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చు. సూచీలు పరుగందుకుంటే నిఫ్టీ 25,900-26,100 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.