న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశీయంగా గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)కు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై రాబడులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో గత నెల సెప్టెంబర్లోనైతే మునుపెన్నడూ లేనివిధంగా పెట్టుబడుల ప్రవాహం జరిగింది. దీంతో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) రికార్డు స్థాయిలో 10 బిలియన్ డాలర్లను తాకింది. నిజానికి నగలు, నాణేలు, కడ్డీలు వంటి సంప్రదాయ బంగారం కొనుగోళ్లకే ఎక్కువగా ఆసక్తి చూపే భారతీయులు.. ఇటీవలికాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపునకు మళ్లారు. ఈ సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి ఏకంగా 902 మిలియన్ డాలర్లు లేదా 7.3 టన్నుల ఇన్‌ఫ్లో ఉండటం ఇందుకు నిదర్శనం. ఇది రూ.8,363 కోట్లకు సమానం. ఆగస్టులో ఇవి రూ.2,190 కోట్లే.
ఈ క్రమంలో మొత్తం నిల్వలు 77.3 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) లెక్కలు చెప్తున్నాయి. ఇక ఈ ఏడాదిలోనే ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడుల విలువ 2.18 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇంతకుముందెప్పుడూ ఈ స్థాయిలో లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. 2024లో 1.28 బిలియన్ డాలర్లుగా, 2023లో 295.3 మిలియన్ డాలర్లుగా, 2022లో కేవలం 26.8 మిలియన్ డాలర్లుగానే ఉండటం గమనార్హం.
డాలర్‌తో పోల్చితే పతనమవుతున్న రూపాయి మారకం విలువ, రాజకీయ-భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్‌లు.. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లకు వారి పెట్టుబడులకు సురక్షిత సాధనంగా గోల్డ్ ఈటీఎఫ్‌లను మార్చాయని డబ్ల్యూజీసీ అంటున్నది. అలాగే పరుగులు పెడుతున్న పసిడి ధరలు కూడా ఓ కారణంగానే చూపుతున్నది. గడిచిన ఏడాది కాలంలో భారతీయ మార్కెట్లో పుత్తడి రేటు 60 శాతం ఎగిసింది. ప్రస్తుతం 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ.1.26 లక్షలుగా ఉన్నది. అయితే ధరలు తగ్గితే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి మరిన్ని పెట్టుబడులు రావచ్చన్న అభిప్రాయాన్ని నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ విక్రమ్ ధవాన్ వ్యక్తం చేస్తున్నారు.
భారతీయులు వేలాది టన్నుల బంగారాన్ని కలిగివున్నారు. వీరి వద్ద ప్రస్తుతం 34,600 టన్నులు ఉన్నట్టు మోర్గాన్ స్టాన్లీ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీటి విలువ 3,785 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ.3 లక్షల కోట్ల కోట్లు). దేశ జీడీపీలో బంగారం వాటా 88.8 శాతంగా ఉన్నది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 4,056 డాలర్లుగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినిమయంలో అతిపెద్ద దేశాల్లో కొనసాగుతున్న భారత్‌లో పుత్తడిని ఆభరణంగాను, పెట్టుబడులు పెట్టడానికి అత్యధికంగా కొనుగోళ్లు జరుపుతారు.