ముంబై, మే 7: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలు చివర్లో నష్టాలకు జారుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి 114 పాయింట్లు నష్టపోయి 77,844.52 వద్ద ముగిసింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.30 పాయింట్లు పతనం చెంది 24,326.65 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్లు రోజంతా అస్థిరంగా కొనసాగాయని, ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల స్థాయిలో కదలాడుతుండటం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. సూచీల్లో హెచ్‌యూఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టైటాన్, సన్‌ఫార్మా, ఐటీసీ షేర్లు భారీగా నష్టపోయాయి.