ముంబై, ఏప్రిల్ 27: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్ పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, సన్‌ఫార్మా షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్ పెంచాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు త్వరలో తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్టు వచ్చిన వార్తలు మదుపర్లను కొనుగోలు వైపు నడిపించాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 639.42 పాయింట్లు లాభపడి 77,303.63 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 194.75 పాయింట్లు అందుకొని 24,092.70 వద్ద స్థిరపడింది.
గత త్రైమాసికంలో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ రిలయన్స్ షేరు భారీగా పుంజుకున్నది. బ్లూచిప్ సంస్థల షేర్లలో అత్యధిక విలువ కలిగిన రిలయన్స్ షేరు ఇంట్రాడేలో మూడు శాతానికి పైగా లాభపడిన షేరు చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 2.88 శాతం అందుకొని రూ.1,365.95 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ లోనూ 2.86 శాతం ఎగబాకి రూ.1,365.80 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.51,837.41 కోట్లు పెరిగి రూ.18,48,477.13 కోట్లకు చేరుకున్నది.