ముంబై, జూన్ 13: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పెరిగిన బ్రెంట్ ముడి చమురు ధరలు.. దేశీయ స్టాక్ మార్కెట్లను శుక్రవారం భారీ నష్టాల్లోకి నెట్టాయి. ఉదయం ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు.. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేకపోయాయి. ఈ క్రమంలోనే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 573.38 పాయింట్లు లేదా 0.70 శాతం కోల్పోయి 81,118.60 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 169.60 పాయింట్లు లేదా 0.68 శాతం దిగజారి 24,718.60 వద్ద స్థిరపడింది. అయితే ఇంట్రా-డేలో సెన్సెక్స్ 1,337.39 పాయింట్లు, నిఫ్టీ 415.20 పాయింట్లు క్షీణించాయి.
ఇక గురువారం సైతం సూచీలు నష్టాల్లోనే ముగియగా.. సెన్సెక్స్ 823.16 పాయింట్లు, నిఫ్టీ 253.20 పాయింట్లు పడ్డాయి. స్టాక్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవని భావిస్తున్న ఇన్వెస్టర్లు.. తమ పెట్టుబడులను బంగారం వంటి సురక్షిత పెట్టుబడి సాధానాల్లోకి మళ్లిస్తున్నారని మెహెతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిసెర్చ్) ప్రశాంత్ తాప్సీ అంటున్నారు. అలాగే మరికొద్ది వారాల్లో అమెరికా ప్రతీకార సుంకాలకు దిగవచ్చన్న అంచనాలు, ఇప్పటికే స్టాక్ మార్కెట్లు గరిష్ఠ స్థాయిల్లో ఉండటంతో సూచీలు దిద్దుబాటుకు లోనుకావచ్చన్న అభిప్రాయాన్నీ ఆయన వెలిబుచ్చారు. ఈ ఏడాదిలోనే ఎప్పుడూ లేనంతగా బ్యారెల్ ముడి చమురు ధర 76 డాలర్లకు సమీపించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి విలువ 59 పైసలు పడిపోయింది. చివరకు మారకం విలువ 86.11కి జారుకున్నది.
లక్షల కోట్ల సంపద ఆవిరి
మార్కెట్లు వరుసగా రెండు రోజులు భారీగా నష్టపోవడంతో మదుపరుల సంపద కూడా హరించుకుపోయింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ శుక్రవారం మరో రూ.2.37 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దీంతో గురు, శుక్రవారాల్లో రూ.8.35 లక్షల కోట్లు దిగజారినైట్టెంది. శుక్రవారం సర్వీసెస్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక సేవలు, మెటల్, విద్యుత్తు రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నాయి. షేర్లవారీగా చూస్తే.. అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, టైటాన్, కొటక్ మహీంద్రా, అల్ట్రాటెక్ షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.32 శాతం, 0.30 శాతం మేర పడిపోయాయి.