ముంబై, ఏప్రిల్ 1: నూతన ఆర్థిక సంవత్సరం తొలిరోజు లాభాలతో ప్రారంభించాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇంట్రాడేలో రికార్డు స్థాయిని తాకిన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం కూడా కలిసొచ్చింది.
వరుసగా మూడోరోజు సోమవారం 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఇంట్రాడేలో 603 పాయింట్లు ఎగబాకి రికార్డు స్థాయి 74,254.62కి చేరుకున్నది. చివర్లో మార్కెట్ ముగిసే సమయానికి 363.20 పాయింట్లు ఎగబాకి 74,014.55 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 135.10 పాయింట్లు అందుకొని 22,462 వద్ద నిలిచింది. దీంతో మదుపరులు లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. గత మూడు సెషన్లలో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరుల సంపద రూ.10.58 లక్షల కోట్ల మేర పెరిగింది. రూ.3,93,15,471.18 కోట్లకు (4.74 ట్రిలియన్ డాలర్లు) చేరుకున్నది.