న్యూఢిల్లీ, నవంబర్ 18 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. ఐటీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు నష్టపోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం కూడా సూచీల పతనానికి ఆజ్యంపోసింది. దీంతో ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 277.93 పాయింట్లు కోల్పోయి 84,558.36 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 26 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది.
చివరకు 103.40 పాయింట్లు పతనం చెంది 25,910.05 వద్ద స్థిరపడింది. సూచీల్లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారని, ఫలితంగా వరుస ర్యాలీకి బ్రేక్పడినట్టు అయిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.