దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీగా నష్టపోయాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,276.04 పాయింట్లు లేదా 1.57 శాతం కోల్పోయి 79,705.91 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 350.20 పాయింట్లు లేదా 1.41 శాతం దిగజారి 24,367.50 దగ్గర నిలిచింది. దేశ-విదేశాల్లో ప్రతికూల పరిణామాలు, ఆల్‌టైమ్ హై దరిదాపుల్లో సూచీలు కదలాడుతుండటం.. మదుపరులను లాభాల స్వీకరణ వైపునకు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ఒడిదొడుకులకు వీలున్నదనే చెప్పవచ్చు. ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు కీలకం కానున్నాయి. ఇక వరుసగా 9వసారీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచినందున ఆ ప్రభావంతో బ్యాంకింగ్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలకు లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక మందగమనం నడుమ ఐటీ రంగ షేర్లకూ ఎదురుదెబ్బే. కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 23,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 24,900-25,200 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.