Market Pulse | గత వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత మోగింది. సూచీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ఉన్నా.. మదుపరులు పెట్టుబడులకే ఆసక్తి కనబర్చారు. అక్కడక్కడా అమ్మకాల ఒత్తిళ్లకు లోనైనా.. ఓవరాల్‌గా మాత్రం కొనుగోళ్లతో కదం తొక్కారు. దీంతో ఈక్విటీ మార్కెట్లు నయా ఆల్‌టైమ్ హైలను సృష్టించాయి. ఫలితంగానే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 963.87 పాయింట్లు ఎగిసి 80 వేలకు కూతవేటు దూరంలో 79,996.60 వద్ద స్థిరపడింది.
అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 313.25 పాయింట్లు ఎగబాకి 24వేల స్థాయికి ఎగువన 24,323.85 దగ్గర నిలిచింది. నిజానికి సెన్సెక్స్ తొలిసారి 80 వేలను దాటిపోయింది. నిఫ్టీ కూడా 24,400 పాయింట్లను అధిగమించింది. అయితే మదుపరులు లాభాల స్వీకరణ వైపు నడిచారు. దీంతో ఈ చారిత్రక స్థాయిల్లో సూచీలు నిలబడలేకపోయాయి.
ఈ క్రమంలో ఈ వారం మదుపరులు పెట్టుబడులు, అమ్మకాల నడుమ ఊగిసలాటకు గురికావచ్చన్న అంచనాలున్నాయి. అందుకే సూచీల ఆటుపోట్లకు అవకాశాలున్నాయని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి.
అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 23,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,700 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 24,700-24,900 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.