ముంబై, జూన్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను అరశాతం తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం మదుపరుల్లో జోష్ పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటం, అలాగే మార్కెట్లో ద్రవ్యలభ్యతను పెంచడానికి నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా కొనుగోళ్లవైపు నడిపించాయి. తీవ్ర ఊగిసలాటల మధ్య ప్రారంభమైన సూచీలు ఆర్బీఐ నిర్ణయంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా పెరిగాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 82 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించినట్టు అయింది. ఇంట్రాడేలో 900 పాయింట్ల వరకు లాభపడిన సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 746.95 పాయింట్లు లాభపడి 82,188.99 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీల్లో 2,278 షేర్లు లాభపడగా, 1,744 సూచీలు నష్టపోయాయి. 134 షేర్లు యథాతథంగా ఉన్నాయి.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ తిరిగి 25 వేల మైలురాయిని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి 252.15 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగిన నిఫ్టీ చివరకు 25,003 వద్ద ముగిసింది.
అందరి అంచనాలకు అనుగుణంగా రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీరేట్లను అర శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వడ్డీరేట్లకు సంబంధించిన షేర్లలో జోష్ పెంచింది. వాహన, గృహ, ఇతర వ్యక్తిగత రుణాలపై ఈఎంఐల భారం తగ్గనున్నది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన షేర్లు ఏడు శాతం వరకు లాభపడ్డాయి. వీటిలో గోద్రెజ్ ప్రాపర్టీస్ 6.75 శాతం, డీఎల్ఎఫ్ 6.61 శాతం, ఒబెరాయ్ రియల్టీ 6.41 శాతం, ప్రిస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్ 5 శాతం, శోభ 4.72 శాతం, మాక్రోటెక్ డెవలపర్స్ 3.68 శాతం, సిగ్నీచర్ గ్లోబల్ ఇండియా 3.02 శాతం, ఫోనిక్స్ మిల్స్ 2.31 శాతం, అనంత్ రాజ్ 1.20 శాతం, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ 1.19 శాతం చొప్పున పెరిగాయి.