ముంబై, అక్టోబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో కదంతొక్కాయి. ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 582.95 పాయింట్లు అందుకొని 81.790.12 వద్ద ముగిసింది. 81,275 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 81,846 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.
మరో సూచీ నిఫ్టీ 25 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. మార్కెట్ ముగిసే సమయానికి 183.40 పాయింట్లు అందుకొని 25,077.65 వద్ద స్థిరపడింది. గడిచిన మూడు సెషన్లలో నిఫ్టీ 466 పాయింట్లు లేదా 1.89 శాతం ఎగబాకి తిరిగి 25 వేల మైలురాయిని అధిగమించింది.
బ్రిడ్జి బేరింగులు, విస్తరణ జాయింట్లు, పలు రకాల రబ్బర్ ప్యాడ్ల ఉత్పత్తుల సంస్థ అమీన్జీ రబ్బర్ లిమిటెడ్..సోమవారం బీఎస్ఈ ఎస్ఎంఈ ఎక్సేంజ్‌లో లిైస్టెంది. కంపెనీ ఐపీవోకి మదుపరుల నుంచి విశేష స్పందన రావడంతో సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 2.12 రెట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ సాధించిందని కంపెనీ సీఎండీ ముఫద్దల్ దీసావాలా తెలిపారు. బీఎస్ఈ ఎంఎస్ఈ ఫ్లాట్‌ఫాంలో లిస్ట్ కావడం ఇదొక మైలురాయివంటిదన్నారు.