ముంబై, ఆగస్టు 29 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. దేశీయ ఎగుమతులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో మదుపరులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ కీలక మైలురాయి 80 వేల స్థాయిని కోల్పోయింది. వారంతపు ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 270.92 పాయింట్లు కోల్పోయి 79,809.65 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 74.05 పాయింట్లు కోల్పోయి 24,426.85 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టపోవడంతో మదుపరులు లక్షల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. వరుసగా మూడు రోజుల్లో మదుపరులు రూ.11 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.11,21,459.36 కోట్లు కరిగిపోయి రూ.4,43,65, 504.08 కోట్లు(5.05 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది.