ముంబై, మే 20: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా కోల్పోయాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాలకు ఆజ్యంపోశాయి. ఫలితంగా వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన సూచీలు మంగళవారం 82 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 900 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 872.98 పాయింట్లు లేదా 1.06 శాతం నష్టపోయి 81,186.44 వద్ద ముగిసింది. 27 సూచీలు నష్టపోగా, కేవలం మూడు సూచీలు లాభాల్లో ముగిశాయి. వీటిలో వాహన, ఆర్థిక, రక్షణ రంగ సూచీలు కూడా నిరాశాజనక పనితీరు కనబర్చడం భారీ నష్టాలను అడ్డుకోలేకపోయాయి. మరో సూచీ నిఫ్టీ సైతం 261.55 పాయింట్లు లేదా 1.05 శాతం పతనం చెంది 24,683.90 వద్ద స్థిరపడింది.