ముంబై, మే 27: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొనడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం మదుపర్లలో ఆందోళన నెలక్నొది. ప్రారంభంలో లాభపడిన సూచీలు చివరికి నష్టాల్లోకి జారుకున్నాయి. 476 పాయింట్ల శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 141.90 పాయింట్లు కోల్పోయి 75,867.80 వద్ద నిలిచింది.
మరో సూచీ నిఫ్టీ 6.55 పాయింట్లు పతనం చెంది 23,907. 15 వద్ద స్థిరపడింది. మంగళవారం సెన్సెక్స 479 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు కుదేలవగా..ఎనర్జీ, మెటల్స్, ఆటో రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. సూచీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తోపాటు ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, పవర్ గ్రిడ్, ఎటర్నల్, ఎన్టీపీసీ, టాటాస్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఐటీ రంగ షేర్లు కిందికి పడిపోగా..క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీస్, పవర్, ఆటో, టెలికాం, కన్జ్యూమర్ రంగ షేర్లు లాభపడ్డాయి.
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు భారీగా పతనం చెందింది. మహారాష్ట్ర ప్రభుత్వరంగ ఏజెన్సీకి చెల్లించిన రూ.45 కోట్ల చెల్లింపులపై బ్యాంక్ ఆడిట్ కమిటీ అంతర్గత విచారణ చేపట్టడంతో బ్యాంక్ షేరు భారీగా నష్టపోయింది. బీఎస్ఈలో బ్యాంక్ షేరు 2.63 శాతం తగ్గి రూ.758.50 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈలోనూ షేరు 2.59 శాతం కోల్పోయింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.31,331.59 కోట్లు కరిగిపోయి రూ.11,67,811.80 కోట్లకు పడిపోయింది.
బక్రీద్ సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లు సెలవుపాటిస్తున్నాయి. తిరిగి శుక్రవారం మార్కెట్లు యథాతథంగా నడుస్తాయి.