ముంబై, మే 26: దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాలపరంపర కొనసాగుతున్నది. యూరోపియన్ దేశాలపై ప్రతీకార సుంకాల విధింపును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలైకి వాయిదావేయడం, రుతుపవనాలు ముందస్తుగా కేరళను తాకడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా వాహన, ఐటీ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడం కూడా సూచీలకు కలిసొచ్చింది.
ప్రారంభంలో 700 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఇంట్రాడేలో 771 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 82వేల మైలురాయిని మళ్లీ అధిగమించింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 455.37 పాయింట్లు అందుకొని 82,176.45 వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ సైతం 148 పాయింట్లు ఎగబాకి 25 వేలకు చేరుకున్నది. ఆటోమొబైల్ రంగ షేర్లతోపాటు తయారీ, ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. మహీంద్రా అండ్ మహీంద్రా షేరు అత్యధికంగా 2.17 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టాటా మోటర్స్, నెస్లె, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే వాహన రంగ సూచీ 1 శాతం అధికమవగా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ సూచీలు లాభపడ్డాయి.