ముంబై, ఆగస్టు 22: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. వరుసగా ఆరు రోజులుగా లాభాల్లో దూసుకుపోయిన సూచీలు ఒక్క శాతం వరకు నష్టపోయాయి. వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పోవెల్ జాక్సన్ సమావేశంపై మదుపరులు దృష్టి సారించడంతోపాటు అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటం కూడా సూచీల పతనానికి ప్రధాన కారణాలు.
వారంతం ట్రేడింగ్‌లో బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా పతనం చెందడం మార్కెట్ల పతనానికి ఆజ్యంపోసింది. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 693.86 పాయింట్లు నష్టపోయి 81,306.85 వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ సైతం 213.65 పాయింట్లు నష్టపోయి 25 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 24,870.10 వద్ద స్థిరపడింది.