ముంబై, సెప్టెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదవడం మదుపరులను ఉత్సాహపర్చింది. దీంతో ఉదయం ఆరం భం నుంచీ మార్కెట్లు లాభాల్లోనే కదలాడాయి.
ఈ క్రమంలోనే సెన్సెక్స్ 554.84 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 80,364.49 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 597.19 పాయింట్లు పుంజుకున్న ది. నిఫ్టీ సైతం 198.20 పాయింట్లు లేదా 0.81 శాతం అందుకుని 24,625.05 వద్ద స్థిరపడింది.
అంతకుముందు 3 రోజులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లతో ఈక్విటీ మార్కెట్లు నష్టాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో.. దక్షిణ కొరియా, జపాన్ సూచీలు నష్టాల్లో ముగిశాయి.