ముంబై, ఆగస్టు 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు జీఎస్టీ సంస్కరణలు, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు చక్కబడుతుండటంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 370.64 పాయింట్లు అందుకొని 81,644.39 పాయింట్ల వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ 103.70 పాయింట్లు ఎగబాకి 25 వేల పాయింట్లకు చేరువైంది. చివరకు 24,989.65 వద్ద స్థిరపడింది. సూచీల్లో అత్యధికంగా 3.5 శాతం ఎగబాకి టాటా మోటర్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు అదానీ పోర్ట్స్ 3.16 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.82 శాతం చొప్పున ఎగబాకాయి.