ముంబై, ఫిబ్రవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ రెండూ 0.8 శాతం మేర పుంజుకున్నాయి. విద్యుత్తు, బ్యాంకింగ్, ఇతర ఆర్థిక రంగ షేర్లకు మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 650.39 పాయింట్లు లేదా 0.79 శాతం ఎగిసి 83,277.15 వద్ద స్థిరపడింది. ఫలితంగా బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.3,11,982.13 కోట్లు పెరిగి రూ.4,68,58,625.33 కోట్లకు చేరింది. ఇక నిఫ్టీ 211.65 పాయింట్లు లేదా 0.83 శాతం ఎగబాకి 25,682.75 వద్ద నిలిచింది.
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపర్చాయని ట్రేడర్లు చెప్తున్నారు. ముడి చమురు ధరల్లో స్థిరత్వం కూడా మార్కెట్ల లాభాలకు దోహదం చేసిందంటున్నారు. కాగా, సెన్సెక్స్ షేర్లలో పవర్‌గ్రిడ్ విలువ గరిష్ఠంగా 4.45 శాతం పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ షేర్లూ లాభపడ్డాయి. రంగాలవారీగా పవర్, యుటిలిటీస్, బ్యాంకింగ్, రియల్టీ షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.95 శాతం పెరుగగా, స్మాల్‌క్యాప్ 0.16 శాతం పడిపోయింది.