ముంబై, నవంబర్ 14 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, టెలికాం రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు కోలుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు ముందుకు నడిపించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ విజయభేరీ మోగించినప్పటికీ సూచీలపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇంట్రాడేలో 450 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు వారాంతపు ట్రేడింగ్ ముగిసే సరికి 84.11 పాయింట్లు అందుకొని 84,562.78 పాయింట్లకు చేరుకున్నది. మరో సూచీ నిఫ్టీ 30.90 పాయింట్లు అందుకొని 25,910 వద్ద స్థిరపడింది. ధరల సూచీ భారీగా తగ్గడంతో రిజర్వుబ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షతోపాటు అమెరికా ఫెడ్ సమావేశాలు జరుగుతుండటంతో మదుపరులు వేచి చూసే దోరణి అవలంభించినట్టు దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
నేటి సూచీల్లో ఎటర్నల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మాస్యూటికల్స్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రిస్, ఐటీసీ, పవర్‌గ్రిడ్, టాటా మోటర్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఇన్ఫోసిస్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహనాలు, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, ఎల్అండ్టీ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. మరోవైపు, ఐటీ, టెక్నాలజీ, కమోడిటీస్, ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు నష్టపోయాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 1,346.5 లేదా 1.61 శాతం, నిఫ్టీ 417.75 పాయింట్లు లేదా 1.64 శాతం లాభపడింది.