ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించే వీలుందనే చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్ష నేపథ్యంలో గత వారం బ్యాంకింగ్, ఆటో తదితర రంగాల షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం సూచీలు బాగా పుంజుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 780.71 పాయింట్లు లేదా 0.97 శాతం పెరిగి 81,207.17 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 239.55 పాయింట్లు లేదా 0.97 శాతం ఎగిసి 24,894.25 దగ్గర నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా కొనుగోళ్ల ఉత్సాహం కొనసాగవచ్చనే మెజారిటీ నిపుణులు చెప్తున్నారు.
సెప్టెంబర్ నెలకుగాను ఆటో రంగ సంస్థలు పెద్ద ఎత్తున వాహన విక్రయాలను జరపడం, రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల కోతకు వీలుందని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా సంకేతాలివ్వడం కలిసొచ్చే అంశాలేనని అంటున్నారు. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం కనిపిస్తే ఆయా రంగాల షేర్లు సెల్లింగ్ ప్రెషర్‌కు గురికావచ్చన్న అంచనాలున్నాయి మరి. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డ అగ్రరాజ్యాధినేత.. ఇటీవలే కొన్ని రకాల ఔషధాలపైనా 100 శాతం సుంకాలు వేశారు. ఇవి ఇలాగే కొనసాగితే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుందన్న అంచనాలైతే ఉన్నాయి. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,200-25,400 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు. విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లకు దూరంగా జరుగుతున్నా.. దేశీయ మదుపరులు తమ పెట్టుబడులతో ఆదుకుంటుండగా.. అది కొనసాగితే సూచీలు పరుగేనని చెప్పవచ్చు.
గమనిక.. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.