Stock Market | ముంబై, డిసెంబర్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రికార్డులతో హోరెత్తించాయి. తాజా ద్రవ్యసమీక్షలో అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడమేగాక, వచ్చే ఏడాది నుంచి రేట్ల కోతలు మొదలవుతాయని సంకేతాలివ్వడం మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నది. ఈ ఉత్సాహంతోనే ఉదయం మొదలు.. ట్రేడింగ్ ముగిసేదాకా ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో రెచ్చిపోయారు.
దీంతో అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. సెన్సెక్స్ తొలిసారి 70వేల ఎగువన, నిఫ్టీ మొదటిసారి 21వేల పైన ముగిశాయి. 929.60 పాయింట్లు లేదా 1.34 శాతం ఎగిసి సెన్సెక్స్ 70,514.20 పాయింట్ల ఆల్‌టైమ్ హై వద్ద నిలవగా, నిఫ్టీ 256.35 పాయింట్లు లేదా 1.23 శాతం ఎగబాకి 21,182.70 పాయింట్ల లైఫ్‌టైమ్ హై వద్ద స్థిరపడింది. ఆయా సంస్థల మార్కెట్ విలువ కూడా ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల్లో పెరిగింది.
అన్ని షేర్లూ పరుగులే..
మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేయడంతో దాదాపు అన్ని రంగాల షేర్లూ లాభాలను అందుకోగలిగాయి. రియల్టీ షేర్లు అత్యధికంగా 3.80 శాతం పుంజుకోగా, ఐటీ 3.21 శాతం, టెక్నాలజీ 2.72 శాతం, టెలికం 2.14 శాతం, ఆర్థిక సేవలు 1.38 శాతం, చమురు, గ్యాస్ 1.36 శాతం, ఎనర్జీ 1.28 శాతం చొప్పున పెరిగాయి. షేర్లవారీగా.. టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు అధికంగా లాభపడ్డాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.06 శాతం, స్మాల్‌క్యాప్ 0.62 శాతం చొప్పున పుంజుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో..
అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే.. ఆసియా దేశాల్లో ప్రధానమైన దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. జపాన్, చైనా సూచీలు మాత్రం నష్టపోయాయి. ఐరోపాలోని బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలుసహా అమెరికా మార్కెట్లూ లాభాల్లోనే ముగిశాయి. ఇక విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం రూ.4,710.86 కోట్ల పెట్టుబడుల్ని తెచ్చినట్టు దేశీయ స్టాక్ ఎక్సేంజ్ వర్గాలు తెలిపాయి.
రూ.355 లక్షల కోట్లకు..
రికార్డుస్థాయి లాభాల నడుమ బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నది. ఇంతకుముందెప్పుడూ లేనట్టుగా రూ.355 లక్షల కోట్లను తాకింది. ఈ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.3.83 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. స్టాక్ ఎక్సేంజ్ వివరాల ప్రకారం గురువారం రూ.3,83,006.92 కోట్లు ఎగిసి బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో ట్రేడ్ అవుతున్న కంపెనీల మార్కెట్ విలువ రూ.3,55,02,238.83 కోట్ల (4.26 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.
ఫెడ్ రిజర్వ్ నుంచి వడ్డీరేట్ల కోతల సంకేతాలు రావడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెద్ద ఎత్తున బలపర్చింది. వచ్చే ఏడాది కనీసం మూడుసార్లు వడ్డీరేట్లను తగ్గిస్తామని ఫెడ్ చెప్పడం.. మదుపరులను పెట్టుబడుల దిశగా నడిపించింది. అమెరికా బాండ్ ఈల్డ్స్‌లో భారీ పతనం కూడా స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచింది. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ రెపోరేటును దించుతుందన్న అంచనాలు పెరగడం, ఐటీ, రియల్టీ షేర్లు మదుపరులను అమితంగా ఆకట్టుకోవడం కూడా కలిసొచ్చింది.
-వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్
తాజా ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను ఫెడ్ రిజర్వ్ యథాతథంగా ఉంచడం స్టాక్ మార్కెట్లను మెప్పించింది. భారత్‌సహా దాదాపుగా ఆసియా, ఐరోపా, అమెరికా మార్కెట్లన్నీ జోష్ మీదున్నాయి. అలాగే క్రూడాయిల్ రేట్లు పడిపోవడం, విదేశీ మదుపరులు పెట్టుబడులకు దిగడం దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. మున్ముందు దేశ జీడీపీ గణాంకాలు ఇంకా మెరుగుపడుతాయన్న ఆశలు, వచ్చే ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపులుంటాయన్న అంచనాలు లాభించాయి.
-ప్రశాంత్ తాప్సీ, మెహెతా ఈక్విటీస్
Investment
ఇంట్రా-డే రికార్డులు
లాభాలకు ప్రధాన కారణాలు