న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశీయ ఐటీ దిగ్గజాలు తమ పంథాను క్రమంగా మార్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు సీనియర్, ఉన్నతాధికారులను నియమించుకోవడానికి పెద్దపీట వేసిన ఐటీ సంస్థలు క్రమంగా ఫ్రెషర్ల కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్‌లు ఏకంగా 1.85 లక్షల మంది ఫ్రెషర్లను తీసుకున్నాయి. ఒకవైపు వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంస్థలు..మరోవైపు ఫ్రెషర్లకు పెద్దపీట వేస్తున్నాయి. గడిచిన మూడు త్రైమాసికాలుగా వలసలు అధికంగా ఉండటంతో ప్రతిభ తక్కువ ఉన్న విద్యార్థుల కోసం ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. 2020-21లో క్యాంపస్‌ల రిక్రూట్మెంట్ల ద్వారా టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 21 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి.
పెరుగుతున్న వలసలు
ఉద్యోగుల వలసలతో ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఏడాదిగా ఐటీ సంస్థల్లో వలసలు భారీగా పెరుగుతున్నాయి. రెండేండ్ల క్రితం టీసీఎస్‌లో 8.6 శాతంగా ఉన్న వలసల శాతం గతేడాదికిగాను 17.4 శాతానికి చేరుకున్నది. అటు ఇన్ఫోసిస్లోనూ వలసలు భారీగా పెరిగాయి. 2020-21లో 13.9 శాతంగా ఉండగా.. 2021-22లో ఇది 27.7 శాతానికి చేరుకున్నది. టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ కూడా వలసలపై ఆందోళన వ్యక్తంచేశారు. త్వరలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదన్నారు.