Industrial Production | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశీయ పారిశ్రామికోత్పత్తి పడకేసింది. గత ఏడాది డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగానే ఉన్నట్టు సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది. 2022 డిసెంబర్లో ఐఐపీ 5.1 శాతంగా ఉండటం గమనార్హం. గనులు, విద్యుదుత్పత్తి రంగాల ప్రదర్శన పేలవంగా ఉన్నట్టు గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ రిపోర్టులో వచ్చింది.
నిజానికి తయారీ రంగంలో ఉత్పత్తి 3.9 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం 3.6 శాతమే. అయినప్పటికీ గనుల రంగంలో ఉత్పాదకత అంతకుముందుతో పోల్చితే 10.1 శాతం నుంచి 5.1 శాతానికి, విద్యుదుత్పత్తి రంగంలో 10.4 శాతం నుంచి 1.2 శాతానికి దిగజారడం దెబ్బతీసింది. ప్రైమరీ గూడ్స్‌లోనూ 8.5 శాతం నుంచి 4.6 శాతానికి దిగజారింది.
మౌలిక, నిర్మాణ రంగ ఉత్పత్తుల్లోనూ వృద్ధి 11 శాతం నుంచి 4.1 శాతానికి దిగొచ్చింది. కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి సైతం 2022 డిసెంబర్‌తో పోల్చితే 2023 డిసెంబర్లో 7.9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోయింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఔట్పుట్ కూడా 11.2 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలోనూ వృద్ధి 3.2 శాతానికే పరిమితమైంది. 2022 డిసెంబర్లో 7.8 శాతంగా ఉన్నది.
రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతం
రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల 3 నెలల కనిష్ఠంగా నమోదైంది. ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడం వల్లే జనవరిలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం 5.1 శాతానికి దిగొచ్చినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) తెలిపింది. అంతకుముందు నెల 5.69 శాతంగా ఉండగా, గత ఏడాది జనవరిలో 6.52 శాతంగా ఉన్నది. నిరుడు ఆగస్టులో గరిష్ఠంగా 6.83 శాతంగా ఉన్న సంగతి విదితమే. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లక్ష్యం 4 శాతంగా ఉన్నది. ద్రవ్యోల్బణం అదుపులో లేనందునే కీలక వడ్డీరేట్లను గరిష్ఠ స్థాయిలోనే కొనసాగిస్తున్నది.