Exports | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశీయ ఎగుమతులు వరుసగా మూడో నెలా పడిపోయాయి. గత నెల 36.43 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. నిరుడుతో పోల్చితే ఈ జనవరిలో 2.38 శాతం తగ్గినట్టు సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు దిగుమతులు భారీగా పెరిగాయి. ఆయా దేశాల నుంచి భారత్‌కు గత నెలలో 59.42 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగినట్టు తేలింది. ఏడాది క్రితంతో చూస్తే 10.28 శాతం ఎగబాకడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు కూడా 22.99 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది జనవరిలో 16.55 బిలియన్ డాలర్లుగా ఉన్నది. కాగా, పెట్రోలియం ధరల్లో ఒడుదొడుకులు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులే భారతీయ ఎగుమతుల క్షీణతకు కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ముడి చమురు దిగుమతులు గత నెల 13.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిరుడు జనవరిలో 16.56 బిలియన్ డాలర్ల క్రూడాయిల్ దిగుమతులు జరిగాయి. గత ఏడాది డిసెంబర్లో 15.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
పెరిగిన బంగారం దిగుమతులు
గత నెలలో దేశంలోకి పసిడి దిగుమతులు 40.79 శాతం పెరిగాయి. గత ఏడాది జనవరిలో 1.9 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడి దిగుమతులు జరుగగా.. ఈ ఏడాది మాత్రం 2.68 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. దేశీయంగా పెరిగిన డిమాండే కారణమని వాణిజ్య మంత్రిత్వ శాఖ చెప్తున్నది. అయితే అంతకుముందు నెల డిసెంబర్లో 4.7 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతులు దేశంలోకి వచ్చినట్టు తేలింది. ఇక ఈ దిగుమతుల్లో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచే వస్తున్నది. ఆ తర్వాత యూఏఈ (16 శాతం), దక్షిణాఫ్రికా (దాదాపు 10 శాతం) దేశాలున్నాయి. ఇక వెండి దిగుమతులు జనవరిలో 82.84 శాతం ఎగిసి 883.18 మిలియన్ డాలర్లకు చేరాయి. కాగా, దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న విషయం తెలిసిందే.
ఏప్రిల్-జనవరిలో..
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో గడిచిన 10 నెలల్లో (ఏప్రిల్-జనవరి) దేశీయ ఎగుమతులు 358.91 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో 601.90 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. ఎగుమతులు 1.39 శాతం పెరిగితే.. దిగుమతులు 7.43 శాతం పెరిగినట్టు తాజా గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఇక వాణిజ్య లోటు 242.99 బిలియన్ డాలర్లుగా ఉన్నది. పసిడి దిగుమతులు 32 శాతం ఎగిసి 37.85 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా దేశీయ పుత్తడి దిగుమతులు 45.54 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈసారి 60 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దేశీయ దిగుమతుల్లో బంగారం వాటానే 5 శాతానికిపైగా ఉంటున్నది. చైనా తర్వాత గోల్డ్ దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నది భారత్‌లోకే. నగల వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండే కారణం. తగ్గిన కస్టమ్స్ సుంకాలు, సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉండటం కూడా కారణాలే అంటున్నారు. గత వారం ఆల్‌టైమ్ హైని తాకుతూ తులం రూ.89,400 పలికిన సంగతి విదితమే.
‘సంఘర్షణలు, పరస్పర సుంకాలతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత వాతావరణం నెలకొన్నప్పటికీ వస్తు, సేవల రంగాల్లో భారతీయ ఎగుమతులు బాగానే జరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, బియ్యం, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఆశాజనకమైన వృద్ధినే కనబర్చాయి. గత ఆర్థిక సంవత్సరం దేశీయ ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం 800 బిలియన్ డాలర్లను మించిపోవచ్చు. గతంతో పోల్చితే ఈ జనవరిలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 15.95 శాతం ఎగిసి సుమారు 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.’
-సునీల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శి
‘కమోడిటీ, మెటల్ ధరల్లో ఒడుదొడుకులు జనవరిలో దేశీయ ఎగుమతుల క్షీణతకు కారణమయ్యాయి. డాలర్‌తో పోల్చితే స్థిరత్వం లోపించిన రూపాయి మారకం విలువ, సుంకాల సమరం వంటివి కూడా ఇబ్బందికరంగా మారాయి.
-అశ్వినీ కుమార్, ఎఫ్ఐఈవో అధ్యక్షుడు