Stock Market | ముంబై, ఏప్రిల్ 4: దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపడంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మరోసారి ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి అగ్రరాజ్యం అమెరికా వెళ్తున్నదంటూ వచ్చిన వార్తలు మదుపరుల్లో ఆందోళనను పెంచింది. దీంతో అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ 76 వేల దిగువకు పడిపోయింది. బ్లూచిప్ సంస్థల కరెక్షన్కు గురికావడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల వరకు నష్టపోయింది.
ఇంట్రాడేలో 1,055 పాయింట్లు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 930.67 పాయింట్లు లేదా 1.22 శాతం నష్టపోయి 75,364.69 పాయింట్ల వద్ద ముగిసింది. మరోసూచీ నిఫ్టీ 345.65 పాయింట్లు(1.49 శాతం) కోల్పోయి 22,904.45 వద్ద స్థిరపడింది. సూచీలు ఒక్క శాతం వరకు నష్టపోవడంతో మదుపరులు రూ.10 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.9,98,379.46 కోట్లు కరిగిపోయి రూ.4,03,34,886. 46 కోట్లకు జారుకున్నది.
త్వరలో దేశీయ ఫార్మా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లను విధించబోతున్నట్టు ప్రకటించడంతో ఈ రంగ షేర్లు కుప్పకూలాయి. అత్యధికంగా 11 శాతం మేర నష్టపోయాయి. మర్కాసన్స్ ఫార్మా షేరు అత్యధికంగా 11.18 శాతం నష్టపోగా..లారస్ ల్యాబ్స్ 7.40 శాతం, శిల్పా మెడికేర్ 6.56 శాతం, ఇప్కా ల్యాబ్స్ 6.53 శాతం, అరబిందో ఫార్మా 5.96 శాతం, లుపిన్ 5.85 శాతం, గ్లాండ్ ఫార్మా 5.51 శాతం, అజంతా ఫార్మా 5.40 శాతం, సిప్లా 5.32 శాతం, బయోకాన్ 5.09 శాతం, దివీస్ ల్యాబ్ 4.70 శాతం, డాక్టర్ రెడ్డీస్ 3.60 శాతం, సన్‌ఫార్మా 3.43 శాతం పతనం చెందాయి.