హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ) : ‘పని మూరెడు.. ప్రచారం బారెడు’ అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ పనితీరు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో రైతులకు సబ్సిడీ కింద పెద్ద ఎత్తున పనిముట్లను అందజేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రచారం చేసిన సర్కార్.. క్షేత్రస్థాయిలో పూర్తి విరుద్ధంగా లక్ష్యాన్ని నీరుగార్చింది. ఈ ఏడాది లక్ష్యంలో కేవలం 7% మాత్రమే పూర్తికావడం పథకం అమలుతీరుకు అద్దం పడుతున్నది. యాంత్రీకరణలో భాగంగా 2025-26 సంవత్సరానికి రూ.101.93 కోట్లతో 1,31,182 యంత్రాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకొన్నది. ఫిబ్రవరి నాటికి కేవలం 8,995 యంత్రాలనే రైతులకు కేటాయించింది. ఇవి కూడా పూర్తిగా రైతులకు పంపిణీ చేయలేదు. ఇందులో 4,091 యంత్రాలను మాత్ర మే రైతులకు అందించింది. మిగతా 4,904 యంత్రాలను పంపిణీ చేయాల్సి ఉన్నది. తద్వారా మొత్తం లక్ష్యంలో కేవలం 7శాతం మాత్రమే పూర్తి చేయడం గమనార్హం.
పనిముట్ల కోసం రూ.101.93 కోట్లకు గాను కేవలం రూ.4.89 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 15 శాతం పంపిణీ చేయగా, ఆ తర్వాత సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో 10 శాతం చొప్పున లక్ష్యాన్ని చేరుకొన్నారు. మిగతా ఏ ఒక్క జిల్లాలోనూ 10 శాతం లక్ష్యం నమోదు కాకపోవడం గమనార్హం. మరీ దారుణంగా ఆదిలాబాద్, ములుగు, మేడ్చల్ జిల్లాల్లో కేవలం 2శాతమే ఈ పథకం అమలు కావడం గమనార్హం. వరంగల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో 3శాతం మాత్రమే రైతులకు యంత్రాలను పంపిణీ చేశారు. ఈ లెక్కలను గమనిస్తే రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఎంత దారుణంగా అమలవుతున్నదో స్పష్టమవుతుంది. వాస్తవానికి ఈ పథకం కేంద్ర, రాష్ర్టాల భాగస్వామ్యంతో కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులు ఖర్చు చేయకుండా కేంద్రం వాటా కింద వచ్చిన నిధులతోనే పథకాన్ని నెమ్మదిగా కొనసాగిస్తూ ప్రచారం చేసుకుంటున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యాంత్రీకరణలో భాగంగా రైతులకు అవసరమైన, రైతులు నచ్చిన, ఆధునిక పరికరాలను ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సిన పరికరాలు ఇవ్వకుండా, అందుబాటులో ఉన్నవి, ఇచ్చినవి మాత్రమే తీసుకెళ్లాలని అధికారులు చెప్తున్నారని తెలిపారు. తమకు డ్రమ్ములో మందుపోసి పిచికారీ చేసే స్ప్రేయర్ ఇవ్వాలని రైతులు కోరితే, భుజానికి వేసుకొని పిచికారీ చేసే స్ప్రేయర్‌ను ఇస్తున్నారని నల్లగొండ జిల్లా రైతులు వాపోతున్నారు. తాము కోరిన పరికరాలు లేవంటున్నారని వివిధ జిల్లాల రైతులు చెప్తున్నారు. ఆధునిక పరికరాలు ఇవ్వకుండా, పాతకాలం పరికరాలే ఇస్తున్నారని తెలిపారు. ఇచ్చేవే కొన్ని, అందులోనూ అవసరమైన పరికరాలు ఇవ్వకపోతే ప్రయోజనం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.