తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, గోవా, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో రెగ్యులేటరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యల్ని అసోచామ్ తమ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం. భూమి, భవన-నిర్మాణ, కార్మిక, పర్యావరణ, వాణిజ్య, పన్నులు, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో ఇబ్బందికర పరిస్థితులున్నట్టు తేల్చింది.
న్యూఢిల్లీ, నవంబర్ 13: సంక్లిష్టకర విధానపరమైన అడ్డంకులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ ఇప్పుడిదే చెప్తున్నది. ‘భారతీయ రాష్ర్టాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరిట గురువారం ఓ నివేదికను అసోచామ్ విడుదల చేసింది. రెగ్యులేటరీ జాప్యాలు, వ్యయాలు, ప్రభావవంతమైన సింగిల్ విండో వ్యవస్థల కొరత వంటివి ఎంఎస్ఎంఈల వ్యాపార నిర్వహణను కష్టతరం చేస్తున్నాయని పేర్కొన్నది.

దేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో కీలక రెగ్యులేటరీ, మౌలికపరమైన అడ్డంకులు వ్యాపార కార్యకలాపాలకు అవరోధాలుగా ఉన్నాయని అసోచామ్ తమ నివేదికలో స్పష్టం చేసింది. జీఎస్టీ సంబంధిత సమస్యలు, సంక్లిష్టమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, రిఫండ్‌లో ఆలస్యాలు, తరచూ ఐటీసీ వివాదాలు, ఈ-వే బిల్లుల వంటి రవాణా, విద్యుత్తు సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ఇబ్బందులున్నాయని వివరించింది. ఇక కఠినమైన కంపెనీ చట్టాలు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలు, సర్టిఫికేషన్ జాప్యాలు, బయోటెక్ ప్రొడక్ట్స్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల్లో అస్పష్టత వంటివి ఎంఎస్ఎంఈలకు పెను భారంగా ఉన్నాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ర్టాల్లో అమలవుతున్న వ్యవస్థలు గాడితప్పాయన్న అసోచామ్.. వెంటనే జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థలతో వాటిని క్రమబద్ధీకరించాలని, మల్టీపుల్ విండోల స్థానంలో సింగిల్ విండో సిస్టమ్స్‌ను తీసుకురావాలని నొక్కిచెప్పింది. డిజిటలైజ్డ్, సమర్థవంతమైన సింగిల్ విండో వ్యవస్థలు రాష్ర్టాల్లో పెట్టుబడు లకు దోహదం చేస్తాయని గుర్తుచేసింది.