Commercial Property | ఉండటానికి ఇల్లు ఒకటి ఉంటే సరిపోదా? అని అడిగితే చాలు అని చెప్పొచ్చు. కానీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే.. మరొకటి కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ రెండో ఆస్తి ఏదై ఉండాలన్నదే చాలామందిని తొలిచే ప్రశ్న. కష్టపడి సంపాదించిన మొత్తాన్ని భూమ్మీద పెడితే ఊహించనంత లాభం రావచ్చు. కానీ, ప్లాటుకు సరిపడా సొమ్ము ఉండాలి కదా!! మరెలా, బ్యాంకు లోన్ ద్వారా మరో ఇల్లు తీసుకోవచ్చు. ధైర్యం చేసి కమర్షియల్ ప్రాపర్టీ కొనొచ్చు.
‘వాడికేం.. హైదరాబాద్‌లో రెండు ఇండ్లున్నాయ్..’ ఈ డైలాగ్ చాలామంది అనడం మామూలే! అయితే, ఆ రెండో ఇంటి ద్వారా రాబడి ఎంత వస్తుందన్నది ప్రశ్న. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు మానసికంగా కొంత ధైర్యం చేయగలిగితే.. కాస్త ఎక్కువ లాభం పొందవచ్చు. రెండో ఇంటిస్థానంలో ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే కిరాయి బాగా వస్తుందని చాలా కొద్దిమంది మాత్రమే ఆలోచిస్తారు. సంపన్నుల విషయానికి వస్తే రెండుతో ఆగరు, నాలుగైదు ఆస్తులు కొనగలిగే సత్తా కలిగి ఉంటారు. మధ్య తరగతి స్థితి నుంచి కాస్త పైకి ఎదిగిన కుటుంబాలు రెండో ప్రాపర్టీ ఏది తీసుకోవాలో తెలియక తికమకపడుతుంటాయి. ఆర్థికంగా కాస్త కుదురుకున్నా.. వారి ఆలోచనలు మాత్రం పొదుపు చుట్టూనే భయం భయంగా తిరుగుతుంటాయి. రిస్క్‌లేకుండా అపార్ట్మెంట్లో ఫ్లాటో, నగర శివారులో ఇండిపెండెంట్ ఇల్లో తీసుకుంటే లొల్లిపోతుందని అనుకుంటారు. అంతేకానీ, రోడ్డుకు జాగా తీసుకొని రెండు షెట్టర్లు వేద్దామనే ఆలోచన చేయరు. కానీ, ఇల్లు తీసుకున్న దానికన్నా, కమర్షియల్ ప్రాపర్టీ తీసుకోవడం వల్ల నెలవారీ ఆదాయం మెరుగవుతుందని గుర్తుంచుకోండి.
కోటి రూపాయలతో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు అనుకోండి. ఎంత ప్రైమ్ ఏరియాలో ఉన్నా అద్దె మహా అయితే రూ.30 వేలు దాటదు. అంటే ఏడాదికి రూ.3.60 లక్షల ఆదాయం సమకూరుతుంది. కిరాయిదారులు అదే ఇంట్లో నాలుగైదు ఏండ్లు కొనసాగుతారన్న గ్యారెంటీ ఉండదు. రకరకాల కారణాల వల్ల వేరే చోటుకు వెళ్లొచ్చు. అద్దె సమయానికి ఇవ్వడం లేదని మీరే పంపించేయొచ్చు. ఈ క్రమంలో ఏడాదికి ఒకటి రెండు నెలలు ఇల్లు ఖాళీగానూ ఉండొచ్చు. పైగా ఇంట్లో ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా బాధ్యత యజమానిపైనే ఉంటుంది! రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం రెండేండ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంచొచ్చు. కానీ, రెండేండ్లలోపే ఆ వ్యక్తి ఇల్లు ఖాళీ చేస్తే.. కొత్తగా వచ్చేవాళ్లు పాత అద్దెకే దిగొచ్చు. దీనికితోడు, ఈ కిరాయిదార్ల వ్యవహారం తేడాగా ఉంటే ఇరుగుపొరుగుకు మీరే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఇరుగుపొరుగే సమస్యగా మారితే.. మీ ఇంట్లో ఉన్నవాళ్లకు మీరే నచ్చజెప్పాల్సి రావచ్చు. మొత్తంగా రెండో ప్రాపర్టీ ఇల్లు అయితే ఇదిగో ఇన్ని సమస్యలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది.
Home Loan
కాస్త ఎక్కువైనా.. కమర్షియల్ ప్రాపర్టీ కొనడం వల్ల యజమానికి కొంత అధిక లాభం చేకూరుతుందని చెప్పొచ్చు. కోటి రూపాయల విలువైన కమర్షియల్ ప్రాపర్టీ మీద నెలకు అద్దె రూ.40వేల వరకు రావొచ్చు. అంటే ఏడాదికి రూ.4.80 లక్షల రాబడి వస్తుంది. నగరంలో రాకపోతే.. జిల్లా కేంద్రంలోనో, మరేదైనా పట్టణంలోనో కోటి రూపాయల్లో రెండు నుంచి మూడు దుకాణాలు వేయడం అసాధ్యం కాదు. మూడు దుకాణాలు ఉంటాయి కాబట్టి, ఎప్పుడైనా ఒకటి ఖాళీ అయినా మిగతా రెండు దుకాణాల అద్దెతో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దుకాణాదారుడి వ్యాపారం బాగా క్లిక్ అయిందో.. వాళ్లు ఖాళీ చేసే అవకాశం ఉండదు. కనీసం పదేండ్లపాటూ అద్దె ఆగదు. ఇటీవలి కాలంలో చిన్నా, పెద్దా మాల్స్‌లో 300 చదరపు అడుగల విస్తీర్ణం మొదలుకొని వేలాది చ.అ. విస్తీర్ణం వరకు అమ్మకానికి పెడుతున్నారు. ప్రాసెస్ అంతా పక్కా లీగల్‌గా ఉంటుంది. శక్తిమేరకు 500 చదరపు అడుగులు కొనుగోలు చేయగలిగితే.. అద్దె రూ.50వేల వరకూ రావచ్చు. ఏటికేడూ అద్దె పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తులో రెట్టింపు లాభానికి అమ్ముకోవచ్చు కూడా! ఉండటానికి ఇప్పటికే ఓ ఇల్లు ఉన్నట్లయితే.. మీ బడ్జెట్లో కమర్షియల్ స్పేస్ తీసుకోవడం వల్ల రెట్టింపు లాభం పొందొచ్చు. అయితే, ప్రాపర్టీ డిప్రిసియేషన్ లెక్కలు బేరీజు వేసుకుంటే అంతిమంగా ఏటా 12 శాతం రిటర్న్‌కు లోటుండదు.
రెండో ప్రాపర్టీకి కూడా బ్యాంకు లోన్ అవకాశం ఉంటుంది. ఇంటికి అయితే తక్కువ వడ్డీకే లభిస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీకి వడ్డీరేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇంటికి 85 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. కమర్షియల్ ఆస్తి విషయంలో అంత రాకపోవచ్చు. ఆ మాత్రం సర్దుబాటు చేసుకోగలిగితే.. రెండో ఆస్తి రెట్టింపు ఆదాయవనరుగా మారుతుంది. పదవీ విరమణ తర్వాత ప్రధాన ఆదాయంగా ఆదుకుంటుంది కూడా.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Bank Auction Property | తక్కువలో వస్తుందని వేలంలో ఇల్లు కొంటున్నారా? ఈ నష్టాల గురించీ ఆలోచించండి
Reverse Mortgage Scheme | మీ ఇంటిని అద్దెకు ఇవ్వకుండానే ఇలా నెలనెలా వేలకు వేలు పొందండి
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
“Home Loan | హోమ్ లోన్ ఎక్కడ తీసుకుంటే బెటర్? బ్యాంకుల్లోనా? ఫైనాన్సియల్ కంపెనీల్లోనా?”