అగ్ర కథానాయిక దీపికా పదుకొణె హాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భారతీయ నటీనటుల పట్ల అక్కడి వారు వివక్ష చూపిస్తుంటారని, అది అందరికీ తెలిసిన విషయమే అని పేర్కొంది. భారతీయ సినిమాలో తిరుగులేని గుర్తింనును దక్కించుకున్న ఈ మంగళూరు సోయగం హాలీవుడ్లో కూడా సత్తా చాటుతున్నది. ‘త్రిబుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ వంటి చిత్రాలతో పాటు పలు అంతర్జాతీయ ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ గ్లోబల్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. ఓ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో దీపికా పదుకొణె హాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడింది. ‘అందరూ అనుకుంటున్నట్లుగా హాలీవుడ్లో ప్రతిదీ నిజాయితీగా, సక్రమంగా ఏమీ ఉండదు. భారతీయ నటీనటులు అక్కడ వివక్షను ఎదుర్కొంటారు.
ముఖ్యంగా శరీర రంగు ఆధారంగా వివక్ష చూపిస్తుంటారు. ఉద్ధేశ్యపూర్వకంగా అలాంటివి జరుగుతుంటాయి. స్కిన్ కలర్‌తో పాటు మన ఇంగ్లీష్ యాసపై కూడా అక్కడ చిన్నచూపు ఉంటుంది. అందుకే హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకొని సక్సెస్ కావడం అంత సులభం కాదు. అయితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ఓ భారతీయురాలిగా నా గొంతును బలంగా వినిపించే ప్రయత్నం చేస్తుంటా. నా మూలాలను గౌరవించే వారితోనే పనిచేస్తానని నిక్కచ్చిగా చెబుతాను’ అని దీపికా పదుకొణె పేర్కొంది. ‘స్పిరిట్’ ‘కల్కి’ వంటి పాన్ ఇండియా తెలుగు చిత్రాల నుంచి దీపికా పదుకొణె తొలగింపు వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా పదుకొణె ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలపై దృష్టి పెడుతున్నది.