న్యూఢిల్లీ, నవంబర్ 8: రికార్డు స్థాయికి చేరుకున్న ధరల కారణంగా బంగారంపై పెట్టుబడుల కోసం చాలా మంది ఇటీవల కాలంలో డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. ఇంటినుంచే కొనుగోలుకు అవకాశాలు ఉండటంతో ఈ తరహా కొనుగోళ్లకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మార్కెట్ నియంత్రణ మండలి సెబీ.. డిజిటల్ గోల్డ్ లేదా ఈ-గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారిని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. డిజిటల్ లేదా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభించే గోల్డ్ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీటి పెట్టుబడులకు దూరంగా ఉండాలని మదుపరులకు సూచించింది. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందటూ ఒక హెచ్చరికను జారీ చేసింది. కొన్ని డిజిటల్, ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ పెట్టుబడిదారులు డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్‌లను అందిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది.
భౌతిక బంగారంలో పెట్టుబడికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ ఇటీవలకాలంలో భారీగా ప్రాచుర్యం పొందింది. అటువంటి డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రణ పరిధిలోకి రావు. ప్రస్తుత చట్టాల ప్రకారం అవి సెక్యూరిటీలు గానీ, కమోడిటీ డెరివేటివ్‌లు కావు కాబట్టి వాటికి సెబీ నియంత్రణ వర్తించదు. అవి పూర్తిగా సెబీ వెలుపల పనిచేస్తాయి. అలాంటి ఉత్పత్తులకు సెక్యూరిటీల మార్కెట్ పరిధిలోని పెట్టుబడిదారుల రక్షణ విధానాలు ఏవి వర్తించవని పేర్కొంది. డిజిటల్ గోల్డ్‌లో కౌంటర్పార్టీ, ఆపరేషనల్ రిస్కుల నుంచి ప్రమాదం పొంచివుంటాయని హెచ్చరించారు. సదరు ప్లాట్‌ఫాం తిరిగి డబ్బు చెల్లించలేకపోవడం, నిర్వహణ పరమైన ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని హెచ్చరించింది.