న్యూఢిల్లీ, నవంబర్ 8: మొబైల్ వినియోగదారులకు మళ్లీ షాకివ్వబోతున్నాయి టెలికాం సంస్థలు. ఇప్పడికే మొబైల్ చార్జీలను పెంచి కస్టమర్ల జేబులకు చిల్లులు పెట్టిన సంస్థలు తాజాగా మరోసారి రీచార్జీలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఏడాది క్రితం 23 శాతం వరకు చార్జీలను వడ్డించిన సంస్థలు మళ్లీ ఈ స్థాయిలో పెంచడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెల 1 నుంచి తమ మొబైల్ రీచార్జి ప్లాన్ల ధరలను 10-12 శాతం వరకు పెంచేయోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. దేశీయ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో ప్రీ-పెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు మరింత భారం కాబోతున్నాయి.
నిర్వహణ ఖర్చులు సాకుగా చూపెడుతూ టెలికాం టారిఫ్‌లను భారీగా పెంచిన సంస్థలు..ఈసారి కూడా ఇదే సాకుగా చూపెడుతు, అలాగే 5జీ సేవలు అందించడానికి భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తున్నదని, దీంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి టారిఫ్‌లను పెంచకతప్పడం లేదని టెలికాం ఇండస్ట్రీ వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నారు. అన్ని సంస్థలు ఇప్పటికే 4జీ సేవలను అందిస్తుండగా, వీటిలో కొన్ని సంస్థలు 5జీ సేవలను కూడా స్టార్ట్ చేశాయి. 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి నూతన టవర్లు, అలాగే స్పెక్ట్రం కొనుగోలు చేయడానికి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నదని కంపెనీల వాదన. ఇదే సమయంలో రోజురోజుకు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని, దీంతో చార్జీలు పెంచాల్సి రావచ్చునని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈసారి మాత్రం అన్ని ప్లాన్లను ధరలు పెంచకపోవచ్చని, కేవలం ప్రారంభ, మధ్య, గరిష్ఠ స్థాయి ప్లాన్లను వడ్డించే అవకాశాలు మెండుగావున్నాయి. జూలై 2024లో టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను 11 శాతం నుంచి 23 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే.
డాటా వినియోగంలో టాప్
దేశవ్యాప్తంగా మొబైల్ డాటా వినియోగం భారీగా పుంజుకుంటున్నది. సరాసరిగా భారత్‌లో ఒక్కో వినియోగదారుడు నెలకు 27 జీబీల నుంచి 35 జీబీల వరకు డాటాను వినియోగిస్తున్నారు. డాటా వినియోగం విస్తృతమవుతుండటంతో టెలికాం సంస్థలు వీరికి నాణ్యమైన సర్వీసులు అందించడానికి భారీగా టవర్లను నెలకొల్పుతున్నాయి.
చిన్న ప్లాన్లకు గుడ్‌బై
ఇప్పటికే పలు టెలికాం సంస్థలు చిన్న స్థాయి ప్లాన్లకు గుడ్‌బై పలికాయి. ఎంట్రీ లెవల్ ప్యాక్‌లను ఎత్తివేయడంతోపాటు డాటా ప్యాక్‌లో కోత పెట్టాయి కూడా. గడిచిన కొన్ని నెలల క్రితం జియో, ఎయిర్టెల్ సంస్థలు రోజుకు 1జీబీ డాటా ప్యాక్‌ను ఎత్తివేసి..ఈ స్థానంలో 1.5 జీబీ డాటా ప్లాన్‌ను రూ.299తో ప్రారంభించింది. పాత ప్లాన్ చార్జీతో పోలిస్తే 17 శాతం పెంచింది. కానీ, వొడాఫోన్ ఐడియా మాత్రం 1జీబీ డాటా ప్లాన్ రూ.299ని కొనసాగించింది. టారిఫ్‌ల పెంపుపై తక్షణమే పెంచే ఆలోచన లేదని, కానీ భవిష్యత్తులో పెంచకతప్పదని దిగ్గజ టెలికాం కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పెంపు తప్పదని, దీర్ఘకాలికంగా టెలికాం సేవలు అందించాలంటే చార్జీలు సవరించాల్సిన అవసరం ఉన్నదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.
మొబైల్ రీచార్జ్ ప్లాన్లు ఇలా ఉండే అవకాశం(రూ.లో) పాతది కొత్తది