Insurance KYC | గతంతో పోలిస్తే మనిషి జీవితంలో ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న అంశమే. కరోనా మహమ్మారి ఉధృతంగా సాగిన వేళ.. లక్షల మంది దారి బారీన పడ్డప్పుడు వైద్య ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. అటువంటి తరుణంలో హెల్త్ బీమా.. జీవిత బీమా ప్రాధాన్యం ప్రతి ఒక్కరికీ తెలిసి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గానీ, ఏదైనా అనివార్య కారణాల వల్ల దురదృష్టకర సంఘటన జరిగితే మీ కుటుంబం, పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అంటే ఫ్యూచర్లో అనూహ్య కష్టనష్టాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కాపాడేదీ బీమా..
ఇన్సూరెన్స్ అనేది ఒక నమ్మకం ఆధారంగా పని చేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన బీమా పాలసీల విషయంలో వివాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. ఇందుకోసం మరింత క్లారిటీ కోసం భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తీసుకొచ్చిన పలు నియమాల్లో ఒకటి కేవైసీ. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి ప్రతి బీమా పాలసీకి నో యువర్ కస్టమర్ (కేవైసీ) సమర్పించడం తప్పనిసరి. ఇది వెహికల్ బీమా మొదలు హెల్త్ బీమా, జీవిత బీమా.. ప్రతి బీమా పాలసీకి వర్తిస్తుంది.
బీమా పాలసీ కొనుగోలు చేసేవారు స్వచ్ఛందంగా దాన్ని తీసుకుంటారు. కనుక ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన రూల్స్‌ను ప్రతి ఒక్కరూ పాటించడం తప్పనిసరి. ఇన్సూరెన్స్ పాలసీల్లో మోసాలు తగ్గించి.. పాలసీదారుల క్లయిమ్‌లు సులభంగా చేసేందుకు `కేవైసీ` తేలిక అవుతుంది.
ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి బీమా పాలసీదారు `కేవైసీ` పత్రాలను సమర్పించాల్సిందే. ఇది వెహికల్ ఇన్సూరెన్స్ చట్టం ప్రకారం వాహనం కల ప్రతి ఒక్కరూ థర్డ్ పార్టీ వెహికల్ బీమా తీసుకోవాల్సిందే. ఇది లైఫ్, హెల్త్, ట్రావెల్, వెహికల్ తదితర ఇన్సూరెన్స్ పాలసీలకు ఉపకరిస్తుంది. ఇంతకుముందు బీమా పాలసీల కొనుగోలుకు ముందు కేవైసీ పత్రాలను సమర్పించాలన్న నిబంధన లేదు. రూ. లక్ష దాటిన క్లయిమ్ సెటిల్మెంట్లకు మాత్రమే కేవైసీ పత్రాలు కావాలని బీమా సంస్థలు కోరేవి.
ఇప్పటి వరకు బ్యాంకు సేవింగ్స్/ డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ తదితర ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్లకు కేవైసీ అడిగేవారు. కానీ ఇప్పుడు ఈ నిబంధన బీమా రంగానికి కూడా వర్తింపజేస్తున్నారు.
కొన్నేండ్ల క్రితం వరకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినా, డీమ్యాట్ ఖాతా ఉన్నా, వెహికల్ లోన్ తీసుకున్నా సీ-కేవైసీ (Central KYC) సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ పాలసీదారుల వద్ద సీ-కేవైసీ నంబర్ ఉంటే తాజాగా తీసుకున్న బీమా పాలసీ కోసం సంబంధిత బీమా సంస్థకు ఇస్తే సరిపోతుంది. ఒకవేళ సీ-కేవైసీ నంబర్ లేకపోతే పాన్ నంబర్ ఇచ్చి సీ-కేవైసీ నంబర్ తీసుకోవచ్చు.
ఇప్పుడు ప్రీ-పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్ నంబర్ తీసుకున్నా ఈ-కేవైసీ సమర్పించడం తప్పనిసరి. ఆధార్ కార్డు ధృవీకృత లింక్డ్ ప్రక్రియ. దీన్ని ఓటీపీతో వెరిఫై చేస్తారు. బీమా పాలసీ కొనుగోలు సమయంలో ఈ-కేవైసీ నంబర్ ఇస్తే సరిపోతుంది.
పాలసీ దారుల వద్ద సీ-కేవైసీ, ఈ-కేవైసీ లేకపోతే, గుర్తింపు, అడ్రస్ రుజువుల కోసం పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు సమర్పించి బీమా సంస్థల నుంచి కేవైసీ నంబర్ పొందొచ్చు.
బీమా పాలసీదారులు కేవైసీ సమర్పించడం వల్ల ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకత పెరుగుతుంది. మోసాలు తగ్గుతాయి. ఇన్సూరెన్స్ సంస్థలకు తమ కస్టమర్ల ప్రొఫైల్ డిటైల్‌గా అందుబాటులో ఉంటుంది. క్లయిమ్ సెటిల్మెంట్ తేలికవుతుంది. మోసపూరిత క్లయిమ్‌లను అరికట్టడంతోపాటు సరైన క్లయిమ్‌లను పరిష్కరించడానికి సాయ పడుతుంది.
ఇక ఐఆర్డీఏఐ జారీ చేసిన `కేవైసీ` నిబంధనలు కొత్తగా బీమా పాలసీదారులు తీసుకునే పాలసీలకు, ఇప్పటికే తీసుకున్న పాలసీల పునరుద్ధరణకు వర్తిస్తాయి. కేవైసీ పత్రాలు సమర్పించిన తర్వాతే కొత్త బీమా పాలసీలు జారీ చేస్తాయి బీమా సంస్థలు. ఇప్పటికే తీసుకున్న పాలసీలకు రెన్యూవల్ గడువులోపు కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.