Microsoft | గ్లోబల్ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగుల రాజీనామాలు పెరుగుతున్నాయి. కొందరు ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే, మరి కొందరిని యాజమాన్యమే తొలగిస్తున్నట్లు కంపెనీ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ నివేదికలో వెల్లడయింది. ముఖ్యంగా మహిళలు, నల్ల జాతీయులు, లాటిన్ అమెరికన్లు కంపెనీ నుంచి వెళ్లిపోతున్నారని ఈ నివేదిక గుర్తించింది. గత జూన్ నాటికి కంపెనీలో రాజీనామా చేసిన ఉద్యోగుల్లో 32.7 శాతం మంది మహిళలే ఉన్నారు. 2023లో ఇది 31 శాతమే. ఇక నల్ల జాతీయుల రాజీనామాలు 8.7 నుంచి 10 శాతానికి, లాటిన్ అమెరికా దేశాల నిపుణుల రాజీనామాలు ఎనిమిది నుంచి 9.8 శాతానికి పెరిగినట్లు నిర్ధారించింది.
ఇతర సాఫ్ట్ వేర్ సంస్థలు తమ ఉద్యోగులను తీసుకోవడం, ఆన్ లైన్ రిటైల్ వ్యాపారంలోకి మారడం వంటి కారణాలతో ఉద్యోగుల రాజీనామాలు పెరిగాయని మైక్రోసాఫ్ట్ భావిస్తున్నది. అయితే తమ సంస్థలో ప్రాతినిధ్యం లేని విభిన్న వర్గాల వారి నియామకం కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే రే మైక్ ఇంటైర్ తెలిపారు. అలా నియమించుకున్న వారికి మెంటర్లను ఏర్పాటు చేసి కేరీర్ ఆప్షన్లు ఇవ్వడం వల్లే వారు నమ్మకంతో మైక్రో సాఫ్ట్లో కొనసాగుతారన్నారు. మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని, నియామకాల్లో వైవిధ్యం విస్తరించాల్సి ఉందన్నారు. వైవిధ్య భరితమైన నియామకాలు మైక్రోసాఫ్ట్ సంస్థకు ఎంతో కీలకం అని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఉత్పత్తుల్లో సేవలందించే వారిలో జాతి, లింగ, ఇతర వివక్షలకు చోటు లేకుండా ముందుకు సాగాల్సి ఉందన్నారు.